పాన్ ఇండియాపైపు హీరోలంతా దృష్టి పెడుతున్నారు. ఇప్పుడు కాకపోయినా, ఎప్పుడో ఒకప్పుడు పాన్ ఇండియా కిరీటం దక్కుతుందని ఆశ. ప్రభాస్ ఇప్పటికే పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. చిరంజీవి కూడా ఆ ప్రయత్నం చేశాడు. మహేష్ బాబు కూడా ఆ దిశగా అడుగులేస్తున్నాడు. ఇప్పుడు విజయ్ దేవరకొండ వంతు వచ్చింది. ఇక మీదట తాను ఎంచుకునే కథల్లో ‘పాన్ ఇండియా స్టఫ్’ ఉండాల్సిందే అన్నది తనకు తాను పెట్టుకున్న కండీషన్. ‘డియర్ కామ్రేడ్’ హిందీలో తప్ప మిగిలిన భాషల్లోనూ విడుదలైంది. ఫలితం మాట అటుంచితే – మిగిలిన భాషల్లో తనకూ కాస్త ఫోలోయింగ్ ఉందన్న విషయం విజయ్‌కి అర్థమైంది. మంచి సినిమా వస్తే – అక్కడ కాసుల గలగలలు ఖాయం. అందుకే విజయ్ పంథా మార్చాడు. ఇటీవల ఓ సూపర్ హిట్ సినిమా తీసిన ఓ దర్శకుడు విజయ్‌కి కథ చెప్పడానికి వెళ్తే.. ‘పాన్ ఇండియా స్టోరీ అయితే చెప్పండి.. వింటాను’ అని ముందే ఓ షరతు పెట్టాడట. దాంతో ఆ దర్శకుడు కథ చెప్పకుండానే తిరిగి వచ్చేశాడు. విజయ్ కోసం కథలు సిద్ధం చేస్తున్న దర్శకులు ఈ విషయాన్నీ మైండ్‌లో పెట్టుకోవాల్సిందే.