తెలుగు మీడియం ఎత్తేసి ఇంగ్లిష్ మీడియం మాత్రమే ఉంచాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న వారిదంతా రాజకీయ దురుద్దేశమేనని… ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తేల్చేశారు. అబుల్ కలాం విద్యా పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన.. ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలా ఎవరెవరు వ్యతిరేకిస్తున్నారో.. ఎవరెవరికి రాజకీయ దురుద్దేశం ఉందో కూడా.. జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, వెంకయ్యనాయుడు, పవన్ కల్యాణ్ పేర్లను ప్రస్తావించారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్స్ ప్రచురించాయి. వెంకయ్యనాయుడు … మాతృభాషా గురించి ఆర్టికల్స్ రాశారు. పవన్ కల్యాణ్ ట్వీట్లు చేశారు. అందుకే.. వీరందర్నీ పేరు పెట్టి మరీ … రాజకీయ దురుద్దేశాలతోనే.. ఇంగ్లిష్ మీడియాన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పుకొచ్చారు.
అయితే.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, వెంకయ్యనాయుడు, పవన్ కల్యాణ్‌లు మాత్రమే కాదు.. అనేక మంది భాషా సాహితీవేత్తలు, ఉపాధ్యాయసంఘాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. వారికి కూడా రాజకీయ దురుద్దేశం ఉందేమో చెప్పలేదు కానీ.. ముఖ్యమంత్రి మాటల్ని బట్టి అదే అర్థంలో తీసుకోవాలి. ఈ విమర్శల్లో పవన్ కల్యాణ్‌పై ప్రత్యేకంగా గురి పెట్టారు జగన్మోహన్ రెడ్డి. పవన్ కల్యాణ్‌కు ముగ్గురు భార్యలు.. నలుగురో.. ఐదుగురో పిల్లలని.. వారందరూ.. ఏ మీడియంలో చదువుతున్నారని ప్రశ్నించారు. మీ కొడుకులు, మనవళ్లు ఏ మీడియంలో చదువుతున్నారు. ఇంగ్లీష్ మీడియాన్ని వ్యతిరేకించేవారు.. వారి పిల్లలను ఏ మీడియంలో చదివిస్తున్నారు..?. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మనవళ్లు ఏ స్కూల్లో చదువుతున్నారో చెప్పాలి..?. అని .. జగన్ డిమాండ్ చేశారు.
ఇంగ్లిష్ మీడియంను వ్యతిరేకించేవారంతా… వైసీపీ వ్యతిరేకులేనని… వారంతా టీడీపీ మద్దతుదారులన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం… విద్యావేత్తలను సైతం ఆశ్చర్య పరుస్తోంది. భాషను కాపాడుకోవడం…అంటే.. తల్లిని కాపాడుకోవడం అనేది.. చాలా మంది చెబుతున్నమాట. అటు తమిళనాడులో కానీ.. ఇటు కర్ణాటకలో కానీ.. ఆయా రాష్ట్రాల ప్రజలు మాతృభాషను.. ఎంత పవిత్రంగా కాపాడుకుంటారో.. చూస్తూనే ఉన్నారు. కానీ ఏపీలో మాత్రం.. దాన్ని హిందీలా.. సంస్కృతంలా ఓ సబ్జెక్ట్‌లా ఉంచేసి… పని కానిచ్చేస్తున్నారు. వ్యతిరేకించిన వారిపై రాజకీయ దురుద్దేశం అంటూ ఎదురుదాడి చేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.