కార్మికుల సమ్మె విషయమై చర్చలు జరపాలంటూ ఆర్టీసీ యాజమాన్యాన్నీ, ప్రభుత్వాన్నీ ఇప్పటికే చాలాసార్లు కోరామని హైకోర్టు ఇవాళ్ల అభిప్రాయపడింది. తమకూ కొన్ని పరిమితులు ఉంటాయనీ, ఇలానే చెయ్యండీ అంటూ ఎవ్వరినీ ఆదేశించలేమని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కోర్టులో ప్రభుత్వం తమ వాదనల్ని బలంగా వినిపించింది. ఆర్టీసీ సమస్యలు అంత సులువుగా తీరవంటూ ఆర్థిక కారణాలను అధికారులు బలంగా వినిపించారు. రూ. 47 కోట్లతో ఆర్టీసీ సమస్యలు తీరేవి కాదని కోర్టుకు చెప్పారు. పాత బస్సుల్ని మార్చాల్సి ఉందనీ, అలాంటి బస్సులు 2609 ఉన్నాయనీ, వాటిని మార్చాలంటే రూ. 750 కోట్లు అవసరమౌతుందని నివేదికలో ప్రభుత్వం పేర్కొంది.
రూ. 2,209 కోట్లు బకాయిలు ఆర్టీసీకి ఉన్నాయనీ, ఉద్యోగులకే దాదాపు రూ. 1500 కోట్లు యాజమాన్యం బకాయిలు ఉన్నాయనీ, మొత్తంగా రూ. 5,200 కోట్లుకుపైగా ఆర్టీసీ నష్టాల్లో ఉందని కోర్టుకి ప్రభుత్వం తెలిపింది. పీకల్లోతు అప్పుల్లో సంస్థ ఉందనీ, ఇప్పుడు దాన్ని ఉద్ధరించడం ఎలా సాధ్యం అనేది ప్రభుత్వ వాదన. అంతేకాదు, ఆర్టీసీ కార్మికులు ఇప్పుడు చేస్తున్న సమ్మెపై కూడా ప్రభుత్వం మరోసారి తన వైఖరిని కోర్టుకు చెప్పేసింది. కార్మికులు చేస్తున్న డిమాండ్లు అర్థం లేనివనీ, వాటిని నెరవేర్చడం అసాధ్యం అనేసింది! ఇంకా ఆర్టీసీని వెనకేసుకుని వచ్చే పరిస్థితి లేదనీ, అందుకే కార్మికులతో ఇప్పుడు చర్చలు జరిపినా ఉపయోగం ఉండదని చెప్పింది. రెండు గంటలపాటు వాదనలు విన్న కోర్టు… విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.
ఆర్టీసీని ఇంకా వెనకేసుకుని రాలేమని చెప్పిన ప్రభుత్వం… ప్రత్యామ్నాయ ప్రజా రవాణా ఏర్పాట్లు చేస్తున్నామని కూడా కోర్టుకు ఇచ్చిన నివేదికలో స్పష్టంగా చెప్పినట్టు సమాచారం. అంటే, ప్రైవేటీకరణ తమ అంతిమ లక్ష్యం అనేది ఇంకోసారి నొక్కి వక్కాణించింది! ప్రభుత్వ వాదన ఎలా ఉందీ అంటే… ఆర్టీసీని ఒక ప్రత్యేకమైన సంస్థగా చూపిస్తూ, నష్టాలు వస్తున్నాయి కాబట్టి… ప్రైవేటీకరించడమే పరిష్కారం అన్నట్టుగా ఉంది. ఇవాళ్ల ఆర్టీసీ… రేప్పొద్దున్న ఏదైనా మరో అనుబంధ సంస్థకు నష్టాలు వస్తే దాన్నీ ప్రైవేటీకరించేయడమే పరిష్కారమా..? అనుబంధ సంస్థలుగా ప్రభుత్వం వీటికి అండగా నిలవాల్సింది పోయి, వాటితో మాకు సంబంధం లేదు, మాకే వాళ్లు చాలా డబ్బులివ్వాలంటూ వాదనలు వినిపిస్తే ఏమనుకోవాలి..? ప్రస్తుతం దాదాపు 50 వేల మంది కార్మికులు చేస్తున్న సమ్మె, వారి డిమాండ్లు చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టుగానే ప్రభుత్వం చూస్తోందని చెప్పాలి. మానవతా దృక్పథంతో ఒక్క మాట కూడా చెప్పకపోవడం గమనార్హం. తదుపరి విచారణలో కోర్టు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.