భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కొద్ది రోజులుగా భారతీయ జనతా పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించని సోము వీర్రాజు.. హఠాత్తుగా.. సీఎం జగన్ ఇంటికి వెళ్లి ఆయనతో గంటకుపైగా సమావేశం అయ్యారు. వైసీపీలో చేరేందుకు ఆయన ఆసక్తి చూపించినట్లుగా ప్రచారం జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి కూడా.. అంగీకారం తెలిపారని అంటున్నారు. ఆ ఉత్సాహంతో.. జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. మద్దతుగా.. సోము వీర్రాజు మాట్లాడుతున్నారు. జగన్ తో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన సోము వీర్రాజు.. చంద్రబాబుపై విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వ విధానానికి అనుగుణంగా మొదటగా.. రాజధానిపైనే గురి పెట్టారు. రాజధానిపై చంద్రబాబు హైప్ క్రియేట్ చేశారని.. రూ.7వేల కోట్లు ఖర్చు చేశామంటున్నారు..ఏం కట్టారో బాబు చెప్పాలని డిమాండ్ చేశారు.
అంతటితో సరిపెట్టలేదు.. బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఇంగ్లిష్ మీడియం వ్యవహారంలో.. వైసీపీకే ఆయన సపోర్ట్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టడం మంచిదేనని తేల్చారు. అయితే బీజేపీ విధానం మాత్రం.. దానికి భిన్నంగా ఉంది. కన్నా లక్ష్మినారాయణ.. మతపరరమైన కోణంలోనే.. ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పార్టీ లైన్ నే ఆయన ప్రకటిస్తారు. కానీ దానికి భిన్నంగా వైసీపీకి మద్దతు ప్రకటించారు సోము వీర్రాజు. పోలవరంలో అవినీతి గురించి.. ఇప్పుడు సోము వీర్రాజుకు పెద్దగా పట్టింపు లేకుండా పోయింది. పోలవరం కంటే విద్య, వైద్యంలో అవినీతి ఎక్కువగా ఉందని దానిపై సీఎం దృష్టి సారించాలన్నారు. వైసీపీలో చేరడానికి నిర్ణయించుకునే.. ఇలా సొంత పార్టీనే ధిక్కరిస్తున్నారన్న అభిప్రాయం బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. సోము వీర్రాజు.. ఒకప్పుడు.. ఏపీ బీజేపీలో తానే గొప్ప నేత అనుకునేవారు. ఆయన తప్ప మరో నేత లేరన్నట్లుగా వ్యవహరించేవారు. 2014లో టీడీపీతో పొత్తు సమయంలో.. రాజమండ్రి నుంచి పోటీ చేసే అవకాశం వచ్చినా.. ఆయన ఆకుల సత్యనారాయణకు ఇచ్చేశారు. ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. దాంతో ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.
అయినప్పటికీ.. సోము వీర్రాజు ఎప్పుడూ.. టీడీపీ విషయంలో సానుకూలంగా లేరు. వైసీపీకే మద్దతుగా ఉండేవారు. ఇటీవలి కాలంలో బీజేపీలోకి వలస నేతలు రావడంతో.. ఆయనకు ప్రాధాన్యం తగ్గిపోయింది. బీజేపీ ఏపీ అధ్యక్షపదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు.. కానీ కన్నా లక్ష్మినారాయణ ఇచ్చారు. ఇటీవలి కాలంలో.. టీడీపీ నుంచి పలువురు నేతలు.. బీజేపీలో చేరడంతో.. వారి హవానే ఎక్కువగా ఉంది. దీంతో.. సోము వీర్రాజును పట్టించుకునేవారే కరువయ్యారు. గాంధీ సంకల్పయాత్రల్లోనూ.. సోము వీర్రాజుకు కనీస సమాచారం లేదు. దాంతో ఆయన బీజేపీకి గుడ్ బై చెప్పి.. వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే.. వైసీపీలో చేరితే ఎమ్మెల్సీ పదవి పోతుంది. ఇంకో ఏడాది వరకూ ఆ పదవి ఉంది.