ఇప్పుడు హైదరాబాద్ లో వాళ్లకేం పని..? అసెంబ్లీ సమావేశాలు జరగడం లేదు. పార్టీకి సంబంధించిన ముఖ్యమైన సదస్సులు లాంటివి ఉన్నాయా, అవీ లేవు. అలాంటప్పుడు సొంత నియోజక వర్గాల్లో ఉండేందుకు ఎందుకు ఇష్టపడం లేదు..? వారంతా ఎవరంటే అధికార పార్టీ తెరాస మంత్రులు, ఎమ్మెల్యేలు! ఈ మధ్య సొంత నియోజక వర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉండటం లేదట! అందరూ రాజధానిలోనే చక్కర్లు కొడుతున్నట్టు సమాచారం. కారణం ఏంటంటే… ఆర్టీసీ కార్మికుల సమ్మె! సొంత నియోజక వర్గాల్లో ఉంటే ఏమౌతుందీ? వినతి పత్రాలతో ఆర్టీసీ కార్మికులు వస్తుంటారు. మీడియాని వెంటేసుకుని వాళ్లొస్తే, ఏదో ఒకటి మాట్లాడాలి. అయితే, ఏం మాట్లాడాలో వాళ్లకే స్పష్టత లేదు! ఎందుకంటే, ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు ఏంటో వారికీ పూర్తిగా అర్థం కానట్టుగా ఉందనే అనొచ్చు! అందుకే, కొన్నాళ్లపాటు నియోజక వర్గానికి దూరంగా ఉంటే బెటర్ అనే ఉద్దేశంతో చాలామంది ఎమ్మెల్యేలు హైదరాబాద్ లో చక్కర్లు కొడుతున్నారట. ఇలా అయితే ఏదీ మాట్లాడాల్సిన అవసరం ఉండదు కదా!
నిజమే కదా… సమ్మె మొదలై నెలరోజులు దాటిపోయినా ముఖ్యమంత్రి కేసీఆర్ తప్ప ఒక్కరంటే ఒక్కరు కూడా మాట్లాడరే? మొదట్లో ఒకట్రెండు రోజులు మంత్రి తలసాని మాట్లాడారంతే! ఆ తరువాత ఆయనా బంద్ చేశారు. ఇతర మంత్రులుగానీ, ఎమ్మెల్యేలుగానీ సమ్మె ఊసెత్తడం లేదు. కార్మికుల ఆత్మహత్యలపై కూడా స్పందించలేదు. ట్విట్టర్ లో ఎప్పుడూ చాలా యాక్టివ్ గా ఉండే మంత్రి కేటీఆర్ కూడా ఈ మధ్య అక్కడా కామ్ అయిపోయారు! మీడియా ముందుకే రావడం లేదు. ఈ మధ్య ఢిల్లీ వెళ్లినప్పుడు… ఆర్టీసీ సమ్మె గురించి జాతీయ మీడియా ప్రశ్నించే ప్రయత్నం చేస్తే, జవాబు చెప్పకుండా ముఖం చాటేసుకుని వెళ్లిపోయారు. అధికార పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ రావు కూడా ఆర్టీసీ సమ్మె గురించి ఇంతవరకూ ఒక్కసారైనా స్పందించింది లేదు.
మంత్రులూ ఎమ్మెల్యేలు స్పందించకపోవడాన్ని… ముఖ్యమంత్రి ఒక్కరే మాట్లాడుతుండటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి..? మీరెవ్వరూ మాట్లాడొద్దని సీఎం మౌఖిక ఆదేశాలు ఇవ్వడంతోనే అందరూ కామ్ గా ఉంటున్నారా..? ఆయనే డీల్ చేసుకుంటున్నారు కదా.. మధ్యలో మనం జోక్యం చేసుకోవడం ఎందుకని ఎవరికి వారు తప్పించుకుంటున్నారా..? రాష్ట్రంలో గడచిన నెలరోజులుగా 50 వేల మంది సమ్మె చేస్తుంటే, దీని ప్రభావం కోట్ల మంది ప్రజల మీద ప్రత్యక్షంగా పడుతుంటే… ప్రజా ప్రతినిధులుగా స్పందించాల్సిన కనీస కర్తవ్యం వీరికి ఉండదా..? ఈ అస్పందనను బాధ్యతా రాహిత్యం అనడంలో తప్పేముంది..?