మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించడానికి గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎవరికైనా ఇరవై నాలుగు గంటల సమయం మాత్రమే ఇస్తున్నారు. వారు ఇతర పార్టీల మద్దతు కూడగట్టుకునే సరికి.. ఆ సమయం గడిచిపోతుంది. అప్పుడు వెళ్లి తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపినా… ఆయన అవకాశం ఇవ్వడం లేదు. వరుసలో ఉన్న తర్వాతి పార్టీని పిలుస్తున్నారు. ఇప్పటికి అతి పెద్ద పార్టీగా ఉన్న బీజేపీని.. ఆ తర్వాత పెద్ద పార్టీగా ఉన్న శివసేనను పిలిచేసిన.. ఆయన తాజాగా ఎన్సీపీకి పిలుపు పంపారు. ఎన్సీపీ కూడా సాయంత్రంలోపు తేల్చకపోతే.. ఆ తర్వాత కాంగ్రెస్ ఒక్కటే మిగిలింది. కాంగ్రెస్‌ను పిలవకుండానే… కోషియరీ రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేసే అవకాశం ఉందన్న ప్రచారం ఢిల్లీలో జరుగుతోంది.
బాల్‌థాకరే ఆశయం అయిన మహారాష్ట్ర పీఠంపై.. శివసైనికుడ్ని కూర్చోబెట్టడాన్ని.. తాను సాధించబోతున్నానని ఉద్దవ్ ధాకరే … అనుకుంటున్న సమయంలో… కాంగ్రెస్ పార్టీ నాన్చివేత ధోరణితో.. ఆయనకు అవకాశం పోయింది. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా శరద్ పవార్ పైనే ఆధారపడింది. పవార్ ఏది చెబితే.. అదే చేస్తామని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తేల్చింది. మరో వైపు పవార్ చెప్పినట్లుగా చేయడానికి శివసేన కూడా రెడీ అయింది. బీజేపీతో తెగదెంపులు చేసుకుంది. ఎన్డీఏ నుంచి బయటకు వస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ క్రమంలో.. శివసేన – ఎన్సీపీ కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని… కాంగ్రెస్ పార్టీ బయట నుంచి మద్దతు ఇస్తుందని.. ప్రచారం జరిగింది. అయితే.. ఆ విషయాన్ని గవర్నర్‌కు అధికారికంగా చెప్పలేకపోవడంతో.. శివసేనకు గొప్ప అవకాశం మిస్సయినట్లయింది.
శివసేన పార్టీ ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడిలా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఇంత వరకూ వచ్చిన తర్వాత మళ్లీ భారతీయ జనతా పార్టీ వద్దకు వెళ్తే… ఆ పార్టీ నేతలు.. ట్రీట్మెంట్లో తేడా చూపిస్తారు. ఇప్పుడు.. ఎలాగోలా.. ఎన్సీపీ – కాంగ్రెస్‌లను ఒప్పించి.. పీఠం చేపట్టడం ఒక్కటే.. శివసేన ఎదురుగా మార్గం. అయితే.. గవర్నర్ ఇచ్చిన అవకాశం మిస్సయింది కాబట్టి.. ఆ తర్వాత… మళ్లీ అవకాశం పొందడం అంత తేలిక కాదు. అంతా గవర్నర్ చేతుల్లో ఉంది. ఇప్పటికిప్పుడు మాత్రం.. శివసేనను మళ్లీ గవర్నర్ ఆహ్వానించడం అంత తేలిక కాదు.