విజయవాడ ధర్నాచౌక్‌లో.. నిర్వహించతలపెట్టిన చంద్రబాబు దీక్షకు… అన్ని పార్టీల మద్దతు పొందేందుకు టీడీపీ తంటాలు పడుతోంది. లెఫ్ట్, జనసేన పార్టీలు సంఘిభావం ప్రకటించాయి కానీ.. ప్రత్యక్షంగా పాల్గొంటాయో లేదో క్లారిటీ లేదు. బీజేపీని కూడా ఆ పార్టీ నేతలు అడిగి వచ్చారు. చంద్రబాబు దీక్షకు బీజేపీ మద్దతు కోరేందుకు.. కన్నా లక్ష్మినారాయణను.. ఆలపాటి రాజా కలిశారు. అయితే.. గతంలో జనసేన లాంగ్ మార్చ్ విషయంలో జరిగిన రచ్చ గుర్తుందేమో కానీ.. ప్రజా సమస్యలపై ఎవరు పోరాడినా మా సంఘీభావం ఉంటుందని హామీ ఇచ్చి పంపించారు. ఇసుక కొరతపై తొలి నుంచి పోరాడుతోంది బీజేపీనేనని కన్నా చెప్పుకొచ్చారు. ఇప్పుడు కూడా.. టీడీపీకి సంఘిభావం తెలిపామని.. టీడీపీతో కలిసే ప్రసక్తే లేదని స్పష్టం చేసారు.
టీడీపీకి సంఘిభావం చెపితే.. కొత్త సమస్యలు వస్తాయనుకున్నారేమో కానీ.. రెండు సార్లు పొత్తు పెట్టుకుని నష్టపోయాం.. భవిష్యత్‌లోనూ టీడీపీతో పొత్తు ప్రసక్తే ఉండదని ముందు జాగ్రత్తగా చెప్పుకొచ్చారు. భారతీయ జనతా పార్టీ ఏపీ నేతలకు కొన్ని రకాల కమిట్మెంట్లు రిజర్వేషన్లు ఉన్నాయి. ఓ వర్గం.. టీడీపీకి వ్యతిరేకంగా.. వైసీపీకి సానుకూలంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటానికి కొంత మంది కలసి రావడం లేదు. పోరాడుతున్న వారిపై హైకమాండ్ కు ఫిర్యాదులు చేస్తున్నారు. జనసేన లాంగ్ మార్చ్ కు.. కన్నా మద్దతు ప్రకటించిన వ్యవహారంలో జరిగిన పరిణామాలు ఇవే నిరూపించాయి. దాంతో.. కన్నా.. వెనక్కి తగ్గక తప్పలేదు.
తెలుగుదేశం పార్టీ అధినేత.. ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఇసుక కొరత వల్ల కూలీలు ప్రాణాలు తీసుకుంటున్న వైనాన్ని వివరించి ప్రభుత్వంపై పోరాటంలో కలసి రావాలని పిలుపునిచ్చారు. విజయవాడ ధర్నా చౌక్‌లో ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకూ.. చంద్రబాబు దీక్ష జరుగుతోంది. గతంలో తన పుట్టిన రోజున.. ధర్మపోరాట దీక్ష ను కూడా.. ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకూ ధర్మపోరాట దీక్ష చేశారు.