తిరుమల తిరుపతి దేవస్థానంలో 75 శాతం ఉద్యోగాలు కేవలం చిత్తూరు జిల్లా వారికే ఇవ్వాలని… టీటీడీ బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు గత బోర్డు సమావేశంలో తీర్మానం చేశారు. అత్యంత రహస్యంగా ఉంచిన ఈ విషయం.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ తీర్మానాన్ని ప్రభుత్వ ఆమోదం కోసం పంపారు. ప్రభుత్వం ఆమోదిస్తే.. ఇక టీటీడీలో ఏ ఉద్యోగం అయినా… చిత్తూరు జిల్లా వాసులకే దక్కుతుంది. ఒక్క ఇరవై ఐదు శాతం ఉద్యోగాలు మాత్రం.. ఇతర ప్రాంతాల వారికి అవకాశం కల్పిస్తున్నారు. ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగులు కచ్చితంగా ఇవ్వాల్సిందేననే చట్టం తెచ్చారు. టీటీడీ పరిశ్రమ కాకపోయినప్పటికీ… 75 శాతం ఉద్యోగాలివ్వాలనే ఆలోచనకు .. పాలక మండలి వచ్చింది.
పాలక మండలిలోఇతర రాష్ట్రాల వారే మెజార్టీగా ఉన్నప్పటికీ.. ఈ తీర్మానానికి ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. తిరుమలలో ఇప్పటి వరకూ ఉద్యోగాల భర్తీ… మెరిట్ ప్రకారమే జరుగుతుంది. ఆ కారణంగా.. తమిళనాడు వాసులు కూడా పెద్ద ఎత్తున.. టీటీడీలో ఉద్యోగాలు సంపాదించారు. కన్నడిగులు కూడా.. ఉద్యోగాలు పొందిన వారిలో ఉన్నారు. టీటీడీ కొత్త నిర్ణయానికి ప్రభుత్వం ఆమోదం తెలిపితే… ఏపీలోని ఇతర జిల్లాల వారికి కూడా.. అవకాశం దక్కదు. ముఖ్యంగా.. రాయలసీమలో మిగతా మూడు జిల్లాలు అయిన కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల వారికీ అవకాశం దక్కదు. రాయలసీమ ఉద్యమ సంఘాలు ఇప్పటి వరకూ.. రాయలసీమ వాసులకు మాత్రమే.. టీటీడీ ప్రయోజనాలు దక్కాలని ఉద్యమాలు చేసేవారు. ఉద్యోగాలు సీమ వాసులకే కల్పించాలని కోరేవారు.
టీటీడీ ఆదాయాన్ని కేవలం.. రాయలసీమకే ఖర్చు పెట్టాలని.. డిమాండ్లు చేసేవారు. టీజీ వెంకటేష్ లాంటి నేతలు.. తమ వాదనను బలంగా వినిపిస్తూంటారు. అయితే.. ఇప్పుడు.. టీటీడీ మరింత కొత్తగా ఆలోచించింది. రాయలసీమ వరకు కాకుండా.. కేవలం చిత్తూరుకే టీటీడీలో ఉద్యోగావకాశాల్ని పరిమితం చేస్తోంది. ప్రభుత్వానికి తెలియకుండా.. ఇలాంటి తీర్మానాలను టీటీడీ బోర్డు చేసే అవకాశం లేదు. .. అందుకే ఈ తీర్మానాన్ని ప్రభుత్వం ఆమోదించడం కూడా లాంఛనమేనని భావిస్తున్నారు.