తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె ఒక కొలీక్కి వచ్చే ప్రయత్నాలపై ఇంకా స్పష్టత రావడం లేదు! కోర్టులో వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇవాళ్ల కూడా కోర్టులో ప్రభుత్వం తమ వాదనల్ని బలంగా వినిపించింది. కార్మికుల సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించాలనీ, గతంలో… అంటే 1998, 2015లో ఆర్టీసీని ఎస్మా పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందనే అంశాన్ని కోర్టు ముందు ఉంచారు న్యాయవాది. అయితే, 1998లో ఇచ్చిన ఉత్తర్వులు ఎ.పి.ఎస్.ఆర్.టి.సి.కి మాత్రమే సంబంధించినవనీ, తెలంగాణ ఆర్టీసీకి అవి ఎలా వర్తిస్తాయని న్యాయస్థానం ప్రశ్నించింది. దీనిపై కూడా న్యాయవాది విద్యాసాగర్ స్పందిస్తూ… 2015లో కూడా ఎస్మా పరిధిలోకి తెచ్చామనీ గుర్తుచేశారు. ఎస్మా ఉత్తర్వులు కేవలం ఆరు నెలలపాటు మాత్రమే వర్తిస్తాయంటూ ధర్మాసనం ఈ వాదననూ కొట్టిపారేసింది.
ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్టబద్ధమా విరుద్ధమా అని కోర్టు తేల్చి చెప్పలేదు అనేది స్పష్టమైపోయింది. అయితే, ఈ సమస్యను పరిష్కరించే దిశగా ప్రత్యామ్నాయ మార్గాన్ని ఈ సందర్భంగా న్యాయస్థానం సూచించింది. ముగ్గురు సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జిలతో ఒక కమిటీ ఏర్పాటు చేసి, ఇరుపక్షాలతో చర్చలు జరిపే ప్రయత్నం చేస్తామని ఇవాళ్ల చెప్పింది. అయితే, ఈ కమిటీ వేయడంపై ప్రభుత్వం స్పందన ఏంటనేది బుధవారం నాడు తమకు తెలియజేయాలంటూ అడ్వొకేట్ జనరల్ కి హైకోర్టు ఆదేశించింది. ఓరకంగా చర్చల ప్రక్రియకు ప్రభుత్వం సిద్ధమా కాదా అని కోర్టు మరోసారి అడిగిందనే చెప్పొచ్చు. దీనిపై ప్రభుత్వం స్పందన ఎలా ఉంటుందో చూడాలి.
ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగిన దగ్గర్నుంచీ వారి డిమాండ్లపై చర్చించేందుకు కేసీఆర్ సర్కారు విముఖంగానే ఉంది. నిజానికి, మొదట్లో కార్మికుల డిమాండ్లుపై ముగ్గురు ఉన్నతాధికారులతో ఓ కమిటీని ప్రభుత్వమే వేసింది. అయితే, ఆ కమిటీ చర్చలు ప్రారంభించకముందే… ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన డిమాండ్ మినహా మిగతావాటిపై మాట్లాడతామని చెప్పడంతో ఆర్టీసీ కార్మికులు బిగుసుకు కూర్చున్నారు. ఆ కమిటీ మీద నమ్మకం లేదని అప్పుడు చెప్పేశారు. దాంతో, చర్చల ప్రక్రియకు బ్రేక్ పడింది. ఆ తరువాత, కోర్టు కూడా చర్చలకు వెళ్లాలంటూ ఇరు వర్గాలకూ చెప్పినా… ప్రభుత్వం తరఫు నుంచి స్పందనే లేదు! ఇప్పుడు మధ్యేమార్గంగా నిపుణుల కమిటీ వేస్తామనే ప్రతిపాదన న్యాయస్థానమే తీసుకొచ్చింది. కనీసం ఈ కమిటీ ద్వారా అయినా ఆర్టీసీ కార్మికుల సమ్మె ఒక కొలిక్కి వచ్చే ప్రయత్నాలు ముందుకు సాగే అవకాశం ఉంటుందా లేదా అనేది వేచిచూడాలి.