కాపుల వేళ్ల తో కాపుల కళ్లను పొడిచి.. ఇసుక సమస్యపై తాను గట్టెక్కాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గట్టి ప్లాన్లే వేశారు. దానికి తన కేబినెట్లోని కాపు మంత్రిని రంగంలోకి దింపి.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై.. అనుచితమైన వ్యాఖ్యలు చేయించారు. పవన్ కల్యాణ్ కులాన్ని గుర్తించేలా.. పవన్ నాయుడు అంటూ సంబోధిస్తూ.. పేర్ని నాని పవన్ కల్యాణ్‌పై.. తీవ్రమైన విమర్శలు చేశారు. ఇందులో నేరుగా కులం పేరు పెట్టి… పవన్ నాయుడూ అంటూ సంబోధించి అభ్యంతరకరంగా మాట్లాడినవి ఎక్కువగా ఉన్నాయి. పవన్‌కు నరనరాన కులభావన జీర్ణించుకుపోయిందని పేర్ని నాని మండిపడ్డారు. కుల గజ్జి ఎవరికుందని ప్రశ్నించారు. సినిమా రైటర్ రాసిస్తే జగన్‌పై విమర్శలు చేస్తావా అంటూ చెలరేగిపోయారు. మీరు థౌజండ్ వాలా అంటిస్తే..ఇక్కడ ఫైథౌజండ్ వాలా అంటిస్తారు.. నువ్వు మ్యాన్ ఫ్రైడే అంటే..మేము మ్యాన్ త్రీ ఉమెన్ అంటామని .. అనేశారు.
పవన్ సినిమాల్లో గబ్బర్ సింగ్.. రాజకీయాల్లో రబ్బర్‌సింగ్ అని రోజా డైలాగుని.. పేర్ని నాని వినిపించారు. పవన్ అరుపులు కేకలు సినిమాల వరకే.. అన్ని మాకు తెలుసని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ పై పేర్ని నాని ఇంత తీవ్రంగా స్పందించడం.. అదీ కూడా పవన్ కల్యాణ్ ను.. సామాజికవర్గ పరంగా టార్గెట్ చేయడం… వ్యూహాత్మకమేనని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నారు. పవన్ కల్యాణ్ ను ఓ సామాజికవర్గ నాయకుడిగా ప్రొజెక్ట్ చేసేందుకు జగన్… పవన్ సామాజివర్గానికి చెందిన నేతల్నే ఉసిగొల్పుతున్నారు. కొద్ది రోజులుగా… ప్రభుత్వం తరపున ఎలాంటి వివాదాస్పద ప్రకటనలు చేయాలన్నా.. ముందుగా.. కాపులనే… తెర మీదకు తీసుకు వస్తున్నాయి.
బొత్స సత్యనారాయణతో రాజధానిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయించారు. ఆయన కూడా కులపరమైన కామెంట్లు చేశారు. దీంతో.. కాపులపై.. అన్ని వర్గాల్లో ద్వేషం పెంచేందుకు జగన్.. తన కేబినెట్ లో ఉన్న కాపు మంత్రులను వాడుకుంటున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ విషయం కాపు మంత్రులకు తెలిసినా.. తమ సామాజికవర్గాన్ని కించ పరిచేలా జగన్ వ్యవహరిస్తున్నారని తెలిసినా.. పదవి కోసం.. వారు జగన్ చెప్పినట్లు చేయకతప్పడం లేదంటున్నారు. మొత్తానికి ఈ కుల రాజకీయం ముందు ముందు మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది.