పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిన్న చేసిన విమర్శల కి సోషల్ మీడియాలో జనసైనికుల నుండి కౌంటర్లు వస్తున్నాయి. జగన్ కి తెలుగు తెలియక పోవడం వల్లే ఇటువంటి విమర్శలు చేస్తున్నారంటూ వచ్చిన ఒక కౌంటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే..
తెలుగు మీడియం తీసివేసి ఆ స్థానంలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలంటూ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద తెలుగు భాషాభిమానుల నుండి విమర్శలు ఎదురవుతున్నాయి. అయితే అటు జగన్ కానీ ఇటు వైఎస్సార్సీపీ నేతలు కానీ ఆ విమర్శలకు సహేతుకమైన రీతిలో సమాధానం ఇవ్వడం మానేసి, విమర్శలు చేసిన వారి మీద అ వ్యక్తిగత విమర్శలు చేయడమే టార్గెట్గా పెట్టుకున్నట్లుగా కనిపిస్తుంది. తెలుగు మీడియం స్థానంలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడాన్ని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విమర్శించిన విషయం తెలిసిందే. ఒకప్పుడు తెలంగాణ యాస అని ఈసడించుకున్న తెలంగాణలో ఇప్పుడు తెలుగుకు పట్టం కడుతూ ఉంటే, మాదే సరైన తెలుగు భాష అంటూ చెప్పుకొచ్చిన ఆంధ్రలో తెలుగు భాష ఉనికి ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితి ఏర్పడింది అంటూ పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు. దీని మీద జగన్ స్పందిస్తూ, “పవన్ కళ్యాణ్ కి ముగ్గురు భార్యలు ఉన్నారు, వారికి నలుగురో ఐదుగురో పిల్లలు ఉన్నారు, వారందరూ ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు” అంటూ జగన్ విమర్శలు చేశారు.
అయితే, జగన్ చేసిన నాటు విమర్శల మీద జనసైనికులు సోషల్ మీడియాలో కౌంటర్లు వేస్తున్నారు. ముగ్గురు భార్యలు అంటే దాని అర్థం ఒకే సమయంలో ముగ్గురితో వివాహ బంధం కలిగి ఉండటం అని, ఒకరికి విడాకులు ఇచ్చి మరొకరిని పెళ్లి చేసుకున్నప్పుడు, మాజీ భార్య అని సంబోధించాలిసి ఉంటుందని, పవన్ కళ్యాణ్ ఏకకాలంలో ముగ్గురిని భార్యలు గా కలిగి లేడని, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి ఈ మాత్రం కనీస తెలుగు తెలియకపోవడం విడ్డూరం అని జనసైనికులు విమర్శలు చేస్తున్నారు. మొత్తానికి ఇంగ్లీష్ మీడియం – తెలుగు మీడియం సమస్య నేపథ్యంలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి తెలుగు పరిజ్ఞానం బయట పడింది అంటూ జనసైనికుల వేస్తున్న కౌంటర్స్ సోషల్ మీడియా లో పాపులర్ అయ్యాయి.