అమరావతిని మార్చాలనుకుంటున్న ఏపీ సర్కార్ దాని కోసం.. కొద్ది రోజులుగా చిత్రవిచిత్రమైన విన్యాసాలు చేస్తోంది. అందులో భాగంగా… ముంపు నుంచి ఖర్చు ఎక్కువ వరకు.. చాలా ప్రకటనలు చేసింది. ఆ తర్వాత మాజీ ఐఏఎస్ అధికారి జీఎన్ రావు కన్వీనర్ గా వివిధ రంగాల నిపుణులతో కమిటీ నియమించింది. ఆ కమిటీ సిఫార్సు మేరకు రాజధాని ఉంటుందని మంత్రి బొత్స చెబుతూ వస్తున్నారు. ఈ జీఎన్ రావు కమిటీ గత నెల రోజులుగా రాష్ట్రంలో పర్యటించింది. అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఆన్ లైన్ లో కూడా తమ అభిప్రాయాలను పంపించాలని కమిటీ సూచించటంతో వేలాది సూచనలు ఈ కమిటీకి అందాయి. ఇందులో దాదాపుగా 65 శాతం వరకు రాజధానిని రాష్ట్రం మధ్యలోనే కొనసాగించాలని సూచించారు. ఉత్తరాంధ్ర, కోస్తా నుంచి ఇటువంటి సూచనలు ఎక్కువగా వచ్చాయి.
రాయలసీమ నుంచి మాత్రం హైకోర్టును ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కొందరు, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని మరికొందరు, ప్రకాశం జిల్లా నుంచి దొనకొండలో రాజధానిని ఏర్పాటు చేయాలని ఇంకొందరు సూచనలు పంపినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా 30వేల మందికిపైగా ఈమెయిల్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడించారు. రాజధానికి రైతులు కూడా కమిటీని తమ వాదనలను వినిపించారు. తాము తెలుగుదేశం పార్టీని చూసి భూములివ్వలేదని… తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతోనే భూములు స్వచ్ఛందంగా ఇచ్చామని రైతులు కమిటీకి తెలియచేశారు. రాజధాని ఒక సామాజికవర్గానికి పరిమితమని కొంతమంది వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారాంపట్ల రైతులు లేఖ రూపంలోనే అసంతృప్తి తెలియచేశారు.
రాజధానిలోనే అభివృద్ధి పరిమితం కాకుండా వికేంద్రీకరణ జరగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ప్రధానంగా రాజధానిపైనే దృష్టికేంద్రీకరించింది. ఇప్పటికే పలు నిర్మాణాలు ప్రారంభం కావడంతో వీటిని ఏం చేయాలి, రైతుల వద్ద నుంచి 33 వేల ఎకరాల భూములను తీసుకోవటం, వారికి ఇప్పటికే ఐదేళ్లు కౌలు కూడా ఇచ్చేయటం, రైతుల భూముల్లో ప్లాట్లు కూడా వేసి వేరే రైతులకు రిజిస్ట్రేషన్లు చేయటంతో ఇప్పుడు రైతుల పరిస్థితి ఏమిటనేది రాష్ట్ర ప్రభుత్వానికి అంతుబట్టని సమస్యగా మారింది. దీనికి కమిటీ ఎలాంటి పరిష్కారం చూపిస్తుందోనన్నది ఆసక్తికరంగా మారింది. నివేదిక ప్రభుత్వానికి అందిన తర్వాత ఓ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.