హైదరాబాద్: కాపులను బీసీల్లో చేర్చటంపై మంజునాథ్ కమిషన్ నివేదిక ఇవ్వటానికి 9 నెలలు పడుతుందని ప్రభుత్వం చెబుతుండగా, 3 నెలల్లో ఇవ్వమని ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఒక్కనెలలోనే నివేదిక పూర్తి చేయొచ్చని చెబుతున్నారు.
రఘువీరా ఇవాళ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, కాపుల విషయంలో చంద్రబాబు వైఖరిని తప్పుబట్టారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీలను ప్రకటించి కూడా 18 నెలల తర్వాత కమిషన్ వేశారని, ఇప్పటికి కూడా ఆ కమిషన్‌లో సభ్యులను నియమించలేదని గుర్తు చేశారు. కాపు కార్పొరేషన్‌కు సంవత్సరానికి రు.1,000 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చి ఇవ్వలేదని, ఇవన్నీ అనుమానాలకు తావిచ్చే విధంగా ఉండటంతో కాపులు ఆందోళనకు దిగటం న్యాయమేనని చెప్పారు. దీనికి పరిష్కారాన్ని కూడా సూచించారు. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, సెంటర్ ఫర్ అకడమిక్ సోషల్ సైన్సెస్ సంస్థలకు కాపుల గణాంకాలు సేకరించే పనిని అప్పజెపితే వారు ఒక్క నెలలోనే ఆ పనిని పూర్తి చేస్తారని చెప్పారు. ఇవన్నీ కాదనుకుంటే 2011లో భారత ప్రభుత్వం కులగణన సర్వే చేసిందని, సామాజిక-ఆర్థిక సర్వే కూడా జరిగిందని వాటిలోనుంచి కూడా కాపుల వివరాలను తెలుసుకోవచ్చని అన్నారు. వీటన్నింటినీ మంజునాథ్ కమిషన్‌కు ఇచ్చి నివేదికను నెలరోజుల్లో తెప్పించుకోవచ్చని రఘువీరా సూచించారు.