ఇసుక కొరతపై విజయవాడలో గురువారం చంద్రబాబు చేయనున్న దీక్షకు.. జనసేన మద్దతును ఆపార్టీ ప్రతినిధులు అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య కోరారు. జనసేనాని ఇంటికి వెళ్లిన టీడీపీ నేతలు.. కొంత సేపు చర్చలు జరిపారు. అయితే.. పవన్ కల్యాణ్ .. చంద్రబాబు దీక్షకు మద్దతు ఇస్తున్నారో లేదో.. అధికారికంగా ప్రకటించలేదు. కానీ.. టీడీపీ నేతలు మాత్రం.. తమ దీక్షకు .. పవన్ కల్యాణ్ సంఘిభావం ప్రకటించారని చెప్పుకున్నారు. ఇసుక సమస్యపై అందరూ ఏక తాటిపైకి వచ్చి పోరాటాలని.. పవన్ కల్యాణ్.. తన లాంగ్ మార్చ్ కు ముందు బహిరంగ ప్రకటన చేశారు. ఆ తర్వాత అన్ని పార్టీల వారికీ స్వయంగా ఫోన్లు చేసి… ఆహ్వానించారు. అయితే.. అన్ని పార్టీలు మాట వరుసకు సంఘీభావం తెలిపాయి తప్ప… లాంగ్ మార్చ్‌లో పాల్గొనలేదు. కానీ టీడీపీ మాత్రమే… మద్దతిచ్చింది. ఆ పార్టీ తరపున అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడు.. లాంగ్ మార్చ్‌లో పాల్గొన్నారు కూడా.
ఇప్పుడు చంద్రబాబు చేయబోతున్న దీక్షకు మాత్రం… జనసేన ఇప్పటి వరకూ మద్దతు ప్రకటించలేదు. ప్రతినిధులు కలిసిన తర్వాత కూడా తన అభిప్రాయాన్ని అధికారికంగా వెల్లడించలేదు. అయితే.. చంద్రబాబు దీక్షకు సంఘిభావం ప్రకటిస్తే చాలని.. ప్రతినిధులు వెళ్లాల్సిన అవసరం లేదన్నట్లుగా జనసేన వర్గాలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే.. తాము పిలిచినప్పుడు.. టీడీపీ వచ్చిందని.. సమస్యపై అందరూ కలసి కట్టుగా పోరాటం చేయాలని పిలుపునిచ్చిన పార్టీనే ఇప్పుడు దూరమైతే.. తప్పుడు సంకేతాలు వెళ్తాయని జనసేనలోనే కొంత మంది వాదిస్తున్నారు. దీంతో నిర్ణయం ప్రకటించడానికి ఆలస్యం అవుతున్నట్లుగా తెలుస్తోంది.
టీడీపీ నేతలు మంగళవారం ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణను కూడా కలిశారు. సమస్యపై పోరాటానికి తమ సంఘీభావం ఉంటుందని… కలిసి పనిచేయలేమని కన్నా స్పష్టం చేశారు. మిగతా వామపక్షాల నేతలను కూడా మద్దతు అడిగారు. ఇసుక సమస్యపై తెలుగుదేశం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి జనసేన, సిపిఐ, సిపియం, కాంగ్రెస్ ప్రతినిధులు హాజరయ్యారు. చంద్రబాబు నిర్వహిస్తున్న దీక్షకు ఆయా పార్టీల ప్రతినిధులు హాజరవుతారని టీడీపీ నేతలు చెబుతున్నారు.