ఆర్టీసీ కార్మికుల సమ్మె వివాదం ఇవాళ్ల కీలక వాదనలు జరిగాయి. ముగ్గురు సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులతో ఒక కమిటీ వేసి, ఇరు వర్గాలతో చర్చించడం ద్వారా సమస్యకు పరిష్కారం చూపే ప్రతిపాదనను హైకోర్టు తెరమీదికి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ ఏర్పాటు మీద కార్మిక సంఘాలు సుముఖం వ్యక్తం చేశాయి, కానీ రాష్ట్ర ప్రభుత్వం దీనికి ఒప్పుకోలేదు. అదే విషయాన్ని ఇవాళ్ల కోర్టుకు తేల్చి చెప్పేసింది. ఇలాంటి హైపర్ కమిటీకి తాము ఒప్పుకునేది లేదనీ, పారిశ్రామిక వివాదాల చట్టంలో ఈ తరహా కమిటీల ప్రస్థావన లేదంటూ ప్రభుత్వం కౌంటర్లో పేర్కొంది. కమిటీ అవసరం ఇప్పుడు లేదని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారాన్ని లేబర్ కమిషన్ కు బదిలీ చేయాలంటూ న్యాయస్థానాన్ని ప్రభుత్వం కోరింది.
కార్మికుల చేస్తున్న సమ్మె చట్ట విరుద్ధమంటూ మరోసారి ఏజీ వాదనలు వినిపించారు. అయితే, పునర్విభజన చట్టం ప్రకారం ఏపీయస్ ఆర్టీసీ విభజన జరగలేదనంటే… చట్టప్రకారమే విభజన చేశామని రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపించింది. పునర్విభజన చట్టంలోని సెక్షన్ – 3 ప్రకారమే టి.ఎస్.ఆర్టీసీని ఏర్పాటు చేశామన్నారు ఏజీ. దానికి సెక్షన్ 47 ప్రకారం కేంద్ర ప్రభుత్వం అనుమతి ఉండాలి కదా, ఆ అనుమతి తీసుకున్నారా లేదా అంటూ కోర్టు ప్రశ్నించింది. దీనిపై స్పందించిన ఏజీ, ఆ అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి లేదనీ, రోడ్డు రవాణాకు సంబంధించి సొంతంగా నిర్ణయాలు తీసుకునే అధికారం రాష్ట్రానికి ఉంటుందని వాదించారు. అధికారం ఉన్నాగానీ… కేంద్రం అనుమతి కచ్చితంగా ఉండాలంటూ న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆర్టీసీ చట్టం కేంద్ర చట్టంలో భాగమే అని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను 18కి వాయిదా వేసింది. ఇక, రూట్ల ప్రైవేటీకరణ అంశమై గురువారం కోర్టు విచారణ చేపట్టనుంది.
ఇవాళ్టితో ఆర్టీసీ కార్మికుల సమ్మె ముగింపునకు ఒక ప్రయత్నం ప్రారంభం అవుతుందీ అనుకుంటే… దీన్ని మరింతగా సాగదీసే ధోరణే ప్రభుత్వ వాదనలో కనిపిస్తోంది. ఈ కేసును లేబర్ కమిషన్ కి బదిలీ చేయాలంటూనే, అక్కడ ఈ సమస్యను పరిష్కరించేందుకు మరో 28 రోజుల సమయం తమకు అవసరమంటూ ప్రభుత్వం చెబుతోంది! అంటే, అక్కడ కూడా ఇంకా సాగదీతకే చూస్తోంది. అంతేకాదు, సమ్మె చట్టవిరుద్ధమే అనేది పదేపదే ప్రభుత్వం వినిపిస్తున్న వాదన. తన పంతం నెగ్గించుకోవాలనే ధోరణే ప్రభుత్వం తీరులో కనిపిస్తోంది. కార్మికుల సమస్యల్ని, ప్రయాణికుల ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని స్పందిస్తున్నట్టుగా లేదు.