లోక్ సభ ఎన్నికల తరువాత తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేసే పనిలో భాజపా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చేరికలకు గేట్లు తెరిచింది! దీంతో ఇతర పార్టీల నుంచి కొంతమంది వచ్చి చేరారు. కాంగ్రెస్, టీడీపీల నుంచి బాగానే చేరికల్ని ప్రోత్సాహిస్తున్నారు. అయితే, ఈ క్రమంలో కొత్తగా వచ్చి చేరిన నేతలకు మాత్రమే పార్టీలో ప్రాధాన్యత లభిస్తోందనీ, వారే ముందు వరుసలో ఉంటున్నారనే చర్చ ఇప్పుడు భాజపా వర్గాల్లో వినిపిస్తోంది. కొత్తవారి మోజులోపడి ఎప్పట్నుంచో పార్టీని నమ్ముకుని ఉన్నవారికి రాష్ట్ర నాయకత్వం, ముఖ్యంగా రాష్ట్ర భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ వినిపిస్తోంది! దీనికి సాక్ష్యంగా ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో పార్టీలో లక్ష్మణ్ వ్యవహరించిన తీరును కొంతమంది వేలెత్తి చూపిస్తున్నారని సమాచారం..!
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు భాజపా మద్దతు ఇస్తూ, రాష్ట్ర ప్రభుత్వం తీరుకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలను చేపడుతోంది. దీని కోసం కార్మికులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు, వారితో కలిసి కార్యక్రమాల నిర్వహణ ప్రణాళికలు వంటి అంశాలపై చర్చించేందుకు ముగ్గురు నేతలతో ఒక కమిటీని లక్ష్మణ్ ఏర్పాటు చేశారు. దీన్లో మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, జితేందర్ రెడ్డి, మోహన్ రెడ్డిలకు అవకాశం ఇచ్చారు. ఈ ముగ్గురినీ లక్ష్మణ్ నియమించడం సొంత పార్టీలో కొంతమందికి అస్సలు నచ్చలేదట! ఎప్పట్నుంచో పార్టీలో ఉన్నవారిలో కనీసం ఒక్కరినైనా ఆ కమిటీలో అవకాశం కల్పిస్తే బాగుండేది కదా అనేది వారి అసంతృప్తి. పార్టీ తరఫున ఏదైనా మీడియా సమావేశం పెట్టినా కూడా కొత్తగా చేరినవారికే లక్ష్మణ్ ప్రాధాన్యత ఇస్తున్నారట. రాష్ట్ర అధ్యక్షుడిగా లక్ష్మణ్ మరోసారి కొనసాగితే… పార్టీలో తమకు ఉన్న పదవులు కూడా దక్కవేమో అనేది కొంతమంది నేతల ఆందోళనగా తెలుస్తోంది.
వలసల్ని ప్రోత్సహిస్తూ, వచ్చి చేరినవారితోనే పార్టీ బలోపేతం అవుతుందని భాజపా బలంగా నమ్ముతోంది. ఫోకస్ అంతా అక్కడే పెడుతోంది. అంగబలం, అర్థబలం, మీడియా బలం ఉన్న నాయకులు టి. భాజపాకి అవసరం! ఇలాంటి అర్హతల ప్రాతిపదికన చేరికలు ఉంటున్నాయి కాబట్టి, సహజంగానే ఆయా నేతలకు ప్రాధాన్యత ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే, ఈ క్రమంలో పార్టీ సిద్ధాంతాలకు నిబద్ధతతో కట్టుబడి ఉంటున్న నాయకులను అశ్రద్ధ చేయడం ఏపార్టీకీ మంచిది కాదు. టి. భాజపాలో అధ్యక్షుడు లక్ష్మణ్ తీరుపై మెల్లగా మొదలైన ఈ చర్చ ఎటువైపు దారితీస్తుందో చూడాలి. ఈ దశలోనే సరిదిద్దుకుంటే మంచిదే!