ఇసుక సరఫరా చేయడం చేతకాకపోతే… చేత కాని వాళ్లమని ప్రజల ముందు చెప్పుకోవాలని.. అంతే కానీ.. వరదలని.. మరొకటని చెప్పి.. పేదల ఉసురు తీయవద్దని చంద్రబాబు మండిపడ్డారు. ఇసుక కొరతపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా.. పన్నెండు గంటల దీక్షను.. చంద్రబాబు ధర్నాచౌక్లో ప్రారంభించారు. ఇసుకను ఉచితంగా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న కూలీల కుటుంబాలకు.. రూ. 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉపాధి కోల్పోయిన కూలీలకు నెలవారీ పరిహారం పంపిణీ చేయాలన్నారు. ఉపాధి కోల్పోయి.. కుటుంబాన్ని పోషించలేక .. కూలీలు ఆత్మహత్యలు చేసుకుంటున్న వైనంపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలన్నీ… ప్రభుత్వ హత్యలేననిృ్నారు.
అసలు ఇసుక సమస్య రావడానికి చాన్సే లేదని..కానీ కావాలని ఇసుక సమస్యను సృష్టించి.. ఇసుక మాఫియాను తయారు చేసి ప్రజలకు మీదకు వదిలారని మండిపడ్డారు. ఏపీ ఇసుక తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో దొరుకుతుంటే ఇంటి దొంగలు ముఖ్యమంత్రికి కనపడరా? అని నిలదీశారు. సెల్ఫీ వీడియోలు తీసుకుని ఆత్మహత్య చేసుకునే దౌర్భాగ్యం కల్పించారని విమర్శించారు. ప్రభుత్వ పెద్దల స్వార్థం కోసమే ఈ సమస్య సృష్టించారన్నారు. దాదాపు 35లక్షల మంది .. 125 వృత్తుల వారు రోడ్డున పడ్డారని గుర్తు చేశారు. ఆత్మహత్యలను మంత్రులు కించ పరచడాన్ని ఖండించారు.
ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా గళమెత్తుతున్నవారిపై.. వ్యక్తిగతంగా దాడి చేయడాన్ని చంద్రబాబు ఖండించారు. పవన్ కల్యాణ్ అంశాన్ని ఆయన ఉదహరించారు. మీ కుటుంబసభ్యులపై వ్యక్తిగత విమర్శలు చేస్తే తట్టుకోగలరా అని వైసీపీ నేతలను ప్రశ్నించారు. ప్రశ్నించిన వారిని బెదిరించి.. కేసులు పెట్టి మాట్లాడకుండా చేద్దామనుకుంటున్నారని.. అలాంటి ఆటలు సాగబోవని హెచ్చరించారు. చంద్రబాబు దీక్షకు.. ఆత్మహత్యలు చేసుకుంటున్న కుటుంబాలు హాజరయ్యాయి. పలు ఇతర పార్టీల నేతల సంఘిభావం తెలిపారు.