ఇసుకపై చంద్రబాబు దీక్షకు జనసేన పార్టీ ప్రతినిధులు హాజరయ్యారు. ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, మరో నేత శివశంకర్.. చంద్రబాబు దీక్షా శిబిరానికి వచ్చి సంఘిభావం తెలిపారు. కార్మికులను ఆదుకోవాలని ఉద్దేశంతో చంద్రబాబు దీక్ష చేస్తున్నారని.. రాపాక వరప్రసాద్ అభినందించారు. చంద్రబాబు ఉచిత ఇసుక విధానం తెచ్చినప్పుడు.. విమర్శించిన వైసీపీ నేతలు ఇప్పుడేం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. 151 సీట్లు గెలిపించిన ప్రజల్ని జగన్ రోడ్డున పడేశారుని మండిపడ్డారు. మద్యం పాలసీ వచ్చినప్పుడు ఒక్కరోజు మద్యం దుకాణాలు ఆగలేదు కానీ.. ఇసుక పాలసీకి మాత్రం 4 నెలలుగా ఇసుక ఆగిపోయిందన్నారు. వ్యక్తిగత విమర్శలతో సమస్యను పక్కదారి పట్టిస్తున్నారుని.. అసలు ఉచిత ఇసుకను ఎందుకు రద్దు చేశారో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇసుక సమస్యపై జనసేన విశాఖలో నిర్వహించిన లాంగ్ మార్చ్‌కు… టీడీపీ ఒక్కటే ప్రత్యక్షంగా మద్దతు పలికింది. ఇతర పార్టీలు సంఘిభావం తెలిపాయి కానీ… లాంగ్ మార్చ్‌కు హాజరు కాలేదు. కానీ టీడీపీ మాత్రం అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడిని పంపింది. పైగా ఇసుక సమస్య అందరూ కలిసి పోరాడి.. కార్మికులకు అండగా నిలబడాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ గతంలో పిలుపునిచ్చారు. ఈ కారణంగా చంద్రబాబు దీక్షకు.. జనసేన తరపున ప్రతినిధుల్ని పవన్ కల్యాణ్ పంపించక తప్పలేదని భావిస్తున్నారు.
ఇప్పటికే.. చంద్రబాబు చెప్పినట్లు పవన్ కల్యాణ్ చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు దీక్షకు… తమ పార్టీ నేతల్ని పంపడం ద్వారా… ఈ విమర్శలు మరింత పెరిగే అవకాశం ఉంది. అయినా పవన్ కల్యాణ్ లెక్క చేయలేదు. ఇసుక సమస్య పరిష్కారం కోసం… కార్మికులకు మేలు జరగడం కోసం.. రాజకీయ విమర్శలను సైతం ఎదుర్కోవడానికి సిద్ధమని పవన్ కల్యాణ్.. చంద్రబాబు దీక్షకు ప్రతినిధుల్ని పంపి నిరూపించారని.. జనసేన వర్గాలు చెబుతున్నాయి.