జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. కడప జిల్లాలో జరుగుతున్న మైనింగ్ కి వ్యతిరేకంగా పులివెందులలో పవన్ కళ్యాణ్ పర్యటన జనసేన పార్టీ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే..
2019 ఎన్నికలలో తమ పార్టీ తో పాటు తాను కూడా ఘోర పరాజయం పొందినప్పటికీ, పవన్ కళ్యాణ్ ఒక సమస్యను గట్టిగా తీసుకెళ్తే పాలకులు ఆ సమస్యపై సరైన రీతిలో స్పందిస్తారు అని ప్రజల్లో ఉన్న భావనను బలపరిచే లాగా పవన్ కళ్యాణ్ కార్యకలాపాలు ఉంటున్నాయి. గతంలో పవన్ కళ్యాణ్ గళమెత్తిన ఉద్దానం సమస్య, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సమస్యలు పవన్ కళ్యాణ్ టేకప్ చేసిన తర్వాత, ఆయా ప్రభుత్వాలు స్పందించి చర్యలు తీసుకున్నాయి. ఇదే కోవలో ఇప్పుడు యురేనియం మైనింగ్ కి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గళమెత్తుతూ ఉన్నారు. జనసేన పార్టీ ట్వీట్ చేస్తూ, “జనసేన నాయకులు, పొలిట్ బ్యూరో సభ్యులు మనందరం ఒకసారి కడప జిల్లా పులివెందులలో పర్యటనకి వెళ్దాం. కేవలం రాజకీయ లబ్ది కోసం కాకుండా యురేనియం తవ్వకాలు వల్ల అక్కడ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. అవి ప్రజల దృష్టికి తీసుకొచ్చి వాళ్లకి ఎలా న్యాయం చెయ్యాలో చూద్దాం – పవన్ కళ్యాణ్” అని వ్రాసుకొచ్చింది.
ఇప్పటికే వైయస్ జగన్ తో ఢీ అంటే ఢీ అంటూ ముందుకు వెళుతున్న పవన్ కళ్యాణ్ పులివెందుల లో పర్యటిస్తే, ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయో అన్న ఆసక్తి నెలకొంది.