అక్రమ కేసులు పెడుతున్నారని.. వేధిస్తున్నారని…నిన్నామొన్నటిదాకా గింజుకున్న వల్లభనేని వంశీకి ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేవుడయ్యాడు. తాము బాల్య స్నేహితులమన్నట్లుగా ఆయన చెబుతున్నారు. అవినావసంబంధం అంటే మాదే అన్నట్లుగా చెబుతున్నారు. అంతటితో ఆగలేదు. చంద్రబాబును తిట్టేశారు. ఆయనతో ఎమోషనల్ కనెక్షన్ లేదని తేల్చేశారు. ఇన్నాళ్లూ టీడీపీలోనే ఉన్నా… జగన్‌తోనే తనకు అంత ఎమోషనల్ కనెక్షన్ ఉందని కవర్ చేసుకునే క్రమంలో.. చంద్రబాబును టీడీపీని చెడామడా తిట్టేశారు. టీవీ చర్చల్లో కనిపించి.. ప్రశ్నించి టీడీపీ నేతలనూ వదిలి పెట్టలేదు. తాను స్వామి మాలలో ఉన్నానన్న స్పృహను కూడా ఆయన మర్చిపోయారు. వల్లభనేని వంశీ ఇంత కంట్రోల్ ఎలా తప్పిపోయారు.. దానికి కారణాలు ఏమిటంటే తెర వెనుక చాలా అంశాలున్నాయంటున్నారు.
అక్రమ పట్టాల పంపిణీ కేసు నమోదు చేసిన తర్వాత .. వల్లభనేని వంశీకి.. చాలా బెదిరింపులు వచ్చాయి. ప్రాణాలకు కూడా గ్యారంటీ ఇవ్వలేమని.. ఓ టీడీపీ ఎమ్మెల్యేను బెదిరించినట్లుగా… ఆంధ్రజ్యోతి ఆర్కే తన పత్రికలో రాశారు. బహుశా ఆ ఎమ్మెల్యే వంశీనే కావొచ్చంటున్నారు. ఈ బెదిరింపులకు భయపడే.. ఆయన టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారంటున్నారు. ఇలా ప్రకటించిన తర్వాత వైసీపీలో తలుపులు పూర్తిగా తెరుచుకోలేదు. ఆయనకు వైసీపీ తరపున పోటీ చేసే అవకాశం ఇవ్వడానికి కానీ.. అసలు పార్టీలో చేర్చుకునే విషయంలోనూ జగన్మోహన్ రెడ్డి కాస్త ఆలోచిస్తున్నారని చెబుతున్నారు. దాంతో.. వంశీ పరిస్థితి డొలాయమానంలో పడింది. రెంటికి చెడ్డ రేవడి అయిపోతానేమోనన్న భయంతో.. ఆయన ఒక్క సారిగా బయటకు వచ్చారు.
చంద్రబాబు దీక్షకు కౌంటర్ ఇవ్వడానికి వంశీ బాగుంటారని.. వైసీపీ అనుకోవడంతో.. ఆయనకు గ్రీన్ సిగ్నల్ లభించింది. వెంటనే.. వంశీ చెలరేగిపోయారు. టీడీపీపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. అనేక ప్రశ్నలు వేశారు. నిజానికి ఆయనకు ఆ ప్రశ్నలన్నింటికీ జవాబులు తెలుసు. జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు దూరంగా ఉన్నారో.. కూడా వల్లభనేని వంశీకి తెలుసు. అయినప్పటికీ.. తాను చేరాలనుకున్న పార్టీకి తనను చేర్చుకోక తప్పని పరిస్థితి కల్పించడానికి.. వల్లభనేని వంశీ అగ్రెసివ్‌గా వెళ్లారు. మరి ఇప్పుడైనా.. వంశీకి వైసీపీలోకి గ్రీన్ సిగ్నల్ వస్తుందా..? వచ్చినా పోటీ చేసే చాన్సిస్తారా..?