జనసేన అధినేత పవన్ కల్యాణ్… హఠాత్తుగా ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు అని జనసేన వర్గాలు చెబుతున్నాయి…కానీ అంతకు మించిన విషయాలు ఉన్నాయని.. అంతర్గతంగా.. జనసేన నేతలు.. చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని పవన్ కల్యాణ్ కలుస్తారని.. చెబుతున్నారు. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తున్న పవన్ కల్యాణ్… తనపై జరుగుతున్న వ్యక్తిగత దాడిని.. సహించే పరిస్థితులో లేరు. భవన నిర్మాణ కూలీల పరిస్థితి… పోలీసులను అడ్డు పెట్టుకుని కేసులు, దాడులతో జరుగుతున్న రాజకీయంపై.. అవసరం అయితే.. కేంద్రానికి ఫిర్యాదు చేస్తానని గతంలో.. పవన్ కల్యాణ్ ప్రకటించి ఉన్నారు. కూలీల ఆత్మహత్యలు పెరిగిపోతూండటంతో.. ఆయన ఈ విషయాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు.
ఢిల్లీలో పవన్ కల్యాణ్‌కు ఎవరెవరి అపాయింట్‌మెంట్లు ఖరారయ్యాయనే విషయంపై.. జనసేన వర్గాలు సైలెంట్ గా ఉన్నాయి. కానీ కీలకమైన మంతనాలు మాత్రం జరగడం ఖాయమని చెబుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షాలను పవన్ కల్యాణ్ కలిసే అవకాశం ఉందని చెబుతున్నారు. 2014 ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్.. అహ్మాదాబాద్ వెళ్లి.. మోడీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచారాలు.. ఇతర సందర్భాల్లో తప్ప.. ప్రత్యేకంగా భేటీ జరగలేదు. అయితే.. మోడీపై తనకు ఎంతో అభిమానం ఉందని..మోడీ కూడా.. తనపై ఎంతో అభిమానం చూపిస్తూంటారని పవన్ చెబుతూంటారు. కొంత కాలం నుంచి మోడీ అపాయింట్మెంట్ కోసం.. పవన్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు.. పీఎంవో నుంచి పిలుపు వచ్చిందన్న ప్రచారం జరుగుతోంది.
పవన్ ఢిల్లీ పర్యటన కచ్చితంగా ప్రత్యేకంగా ఉంటుందని.. తిరిగి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అనూహ్య పరిణామాలు ఉంటాయని.. జనసేన వర్గాలు చెబుతున్నాయి. కొంత కాలం నుంచి పవన్ కల్యాణ్.. కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. బొత్స సీఎం కావొచ్చని.. జగన్ పరిస్థితి అటూ ఇటూ అయితే.. మిగతా ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటని ఆయన చేస్తున్న వ్యాఖ్యలపై రాజకీయవర్గాల్లో పలు రకాల చర్చలకు కారణం అవుతోంది. పవన్ ఢిల్లీ టూర్.. ఎలాంటి మార్పులు తెస్తుందో.. వేచి చూడాల్సిందే..!