తెలుగు360 రేటింగ్: 1.5/5
నవ్వుకి మించిన కాలక్షేపం, నవ్వుకి మించిన టానిక్ ఎక్కడ దొరుకుతుంది? అయితే హాస్యం.. అంత ఈజీ కాదు. అలాగని బ్రహ్మ విద్య కూడా కాదు. ప్రేక్షకులకు చిన్న రిలీఫ్ చాలు. వాళ్ల పెదాలపై చిన్న మందహాసం సరిపోతుంది. అందుకే జబర్దస్త్ లాంటి కామెడీ షోలు అంతంత పెద్ద హిట్టవుతున్నాయి. `ఇది కామెడీ సినిమా` అనే ట్యాగ్ లైన్‌తో వస్తే – నవ్వుల్ని కోరుకునేవాళ్లు తప్పకుండా ఆ సినిమాపై దృష్టి పెడతారు. `తెనాలి రామకృష్ణ బి.ఏ బి.ఎల్` కూడా కామెడీ సినిమా అనే ముద్ర వేసుకునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకుడు నాగేశ్వరరెడ్డి బ్రాండ్ కూడా వినోదమే. కాబట్టే – మళ్లీ కాసిన్ని నవ్వులు అందుకోవాలని జనాలు ఎదురుచూశారు. మరి తెనాలి ఏం చేశాడు? నవ్వించాడా? విసిగించాడా? ఏమా రామకృష్ణుడి కథ..?
కథ
తెనాలి రామకృష్ణ (సందీప్‌కిషన్) ఓ కుర్ర లాయరు. `నాకో కేసు ఇప్పించండి ప్లీజ్` అంటూ బోర్డులు పెట్టుకుని మరీ క్లయింట్లని ఆహ్వానిస్తుంటాడు. కానీ.. ప్రయోజనం ఉండదు. చేతికందిన కేసులు కూడా జారిపోతుంటాయి. అందుకే.. కోర్టులో పెండిగుంలో ఉన్న కేసుల్ని కాంప్రమైజ్ చేస్తుంటాడు. కానీ తండ్రి (రఘుబాబు)కి మాత్రం తెనాలిని గొప్ప లాయరుగా చూడాలని ఆశ. కానీ కేసు వస్తే కదా, వాదించి గెలవడానికి..? మరోవైపు రుక్మిణి (హన్సిక)ని తొలి చూపులోనే ప్రేమించేసి తన వెంటపడుతుంటాడు తెనాలి.
తెనాలిలో సింహాద్రి నాయుడు (అప్పయ్య శర్మ), వరలక్ష్మి (వరలక్ష్మీ శరత్ కుమార్) మధ్య రాజకీయమైన పోటీ ఉంటుంది. వరలక్ష్మి ని ఎలాగైనా సరే ఇరికించాలని ప్లాన్ చేసిన సింహాద్రి నాయుడు, ఆమెపై ఓ హత్య కేసు బనాయిస్తాడు. వరలక్ష్మీ తరపుపు లాయరు చక్రవర్తి (మురళీశర్మ). సింహాద్రి నాయుడుతో చేతులు కలుపుతాడు. వరలక్ష్మిని జైలుకు పంపాలని పథకం వేస్తాడు. ఈ ప్లాన్‌ని తెనాలి రామకృష్ణ ఎలా తిప్పి కొట్టాడు? తన తెలివితేటలతో ఈకేసు ఎలా గెలిచాడు? అనేదే కథ.
విశ్లేషణ
హాస్యగంధ్రులు ఎక్కువున్న కొంతమంది నిర్మాతల్ని పోగేసి, వాళ్లలో వాళ్లే కుళ్లు జోకులు వేసుకుని, తెగ నవ్వేసుకుని – అవి తెరపైకొస్తే ప్రేక్షకులూ నవ్వుకుంటారని భ్రమపడి ఈ సినిమా తీసుంటారు. తెరపై పాత్రలు నవ్వుకోవడమే తప్ప, థియేటర్లన్నీ లాఫింగ్ గ్యాసులతో నింపేసినా – నవ్వురాదు. అలాగున్నాయి ఆ సన్నివేశాలు. వినోదాత్మక చిత్రాలకు కథలతో సంబంధం లేదు. కాస్త లైన్ ఉంటే సరిపోతుంది. అలాంటిది ఈ కథని అయిదుగురు రచయితలు కూర్చుని వండారు. దాంతో – బ్రహ్మాండమైన సబ్జెక్ట్ వచ్చేసిందనుకుంటే పొరపాటే. పాత చింతకాయ పచ్చడి లాంటి కథనే అటూ ఇటూ తిప్పి, రెండు ట్విస్టులు జోడించి కాస్త హంగామా చేయాలనుకున్నారంతే. కోర్టు వ్యవహారాలు, కథానాయకుడి అతి తెలివితేటలు, కాంప్రమైజ్ ఎపిసోడ్లూ.. నవ్వించే స్కోప్ ఉన్న సన్నివేశాలే. కాకపోతే.. దర్శకుడు దాన్ని వాడుకోలేకపోయాడు. ఎలాగూ హీరోయిన్ని పెట్టుకున్నాం కదా అని ఆమె కనిపించినప్పుడల్లా పాటలు మొదలెట్టేశారు. దాంతో రీళ్లూ, లక్షలూ రెండూ వృథా అయిపోయాయి.
ఈ సినిమాలో నాలుగైదు జబర్దస్త్ ఎపిసోడ్లు కనిపించాయి. బుల్లి తెరపై ఆయా ఎపిసోడ్లని సమర్థంగా నడిపించిన ఛమ్మక్ చంద్ర, వెండి తెరపై తేలిపోయాడు. వెగటు పుట్టించాడు. అంటే కారణం.. స్క్రిప్టు అంత అధ్వాన్నంగా ఉందన్నమాట. తెరపై ఛమ్మక్ చంద్రిక ని చూసి వెన్నెల కిషోర్, అన్నపూర్ణలు వాంతులు చేసుకుంటారు. ఆయా సన్నివేశాల్ని చూసిన ప్రేక్షకులదీ ఇంచుమించుగా అదే పరిస్థితి. ఏకే పాల్ వ్యవహారం, కోడి కత్తి, గ్రామ వాలంటరీలు… ఇలా కాంటెంపరరీ విషయాన్నీ ఈ సినిమాలో డైలాగులుగా వాడేసుకున్నారు. కానీ… అవేం సరిగా పేలలేదు. కథలో, కంటెంట్‌లో, తీసే సన్నివేశంలో విషయం ఉంటే కదా…? అవి లేనప్పుడు ఎన్ని హంగులు వేసినా వేస్టే. కోర్టు సీను మరో పరాకాష్ట. ఏకే పాల్ ఓ సందర్భంలో ఓ మాడ్యులేషన్లో ఇచ్చిన ప్రసంగాన్ని పేరడీ చేశారు. సత్యకృష్ణన్ కాస్త ఏకే పాల్ డైలాగ్ డెలివరీ అందిపుచ్చుకుంది. ఆ సన్నివేశం అయితే వికారం పుట్టించడం ఖాయం. కామెడీ గ్యాంగ్‌కి కరెంట్ షాక్ పెట్టించి – అందులోనే నవ్వులు పిండుకోమన్నాడు దర్శకుడు. ఇలాంటి వెటకారాలు విరాకాలు చాలా ఉన్నాయి ఈ సినిమాలో.
నటీనటులు
సందీప్ కిషన్ చేయాల్సిన సినిమా కాదిది. అల్లరి నరేష్లాంటి వాడు చూస్తే ఇంకాస్త బెటర్‌గా వర్కవుట్ అయ్యేది. సందీప్ నటించడానికి ప్రయత్నించాడు. అయితే కామెడీ టైమింగ్ తనకు ఏమాత్రం సూటవ్వలేదు. క్లైమాక్స్‌కి ముందు సందీప్ 20 నిమిషాల వరకూ కనిపించడు. ఆ బాధ్యత కామెడీ గ్యాంగ్‌కి అప్పగించి తాను పక్కకు తప్పుకున్నాడు. హన్సికని ఎందుకు తీసుకున్నారో అర్థం కాదు. కళ్లకిందే క్యారీ బ్యాగులు వస్తుంటాయి. ఆమె మొహమంతా క్యారీ బ్యాగులే కనిపించాయి. నవ్వితే అస్సలు చూడలేకపోయాం. వరలక్ష్మి పాత్రకు ఇచ్చిన బిల్డప్ అంతా ఇంతా కాదు. కాకపోతే విషయం తక్కువ. పోసాని, ప్రభాస్ శీను, వెన్నెల కిషోర్… ఇలాంటి వాళ్లకు ఇవాల్సిన పాత్రలా ఇవి? రాంగ్ జడ్జిమెంట్.
సాంకేతిక వర్గం
అయిదుగురు రచయితలు వండిన కథా కథనాలివి. ఇంత కంటే జబర్దస్త్ స్కిట్టులే బ్రహ్మాండంగా పేలతాయి. రైటింగ్ ఫాల్ట్ తప్పకుండా కనిపిస్తుంది. పాటల్లో ఉన్న క్వాలిటీ సన్నివేశాల్లో కనిపించదు. ఆ పాటలూ వేస్టే. నా పేరు తెనాలి, నామాట వినాలి.. వెళ్లాలి కులూమనాలి.. ఇలా కేవలం ప్రాసల కోసం పాట రాశారు. దర్శకుడు కూడా `నేను చెప్పిందే వినాలి` అని పట్టుపట్టి కూర్చుని ఉంటాడు. ఆయన చెప్పిందే సీన్ అయి కూర్చుంది. నేపథ్య సంగీతంలో హడావుడి బాగుంది. కెమెరా వర్క్ మాత్రం మంచి పనితనం కనిపించింది.
కామెడీని మరీ అంత కామెడీగా తీసుకోకూడదు. ఎంతో కష్టపడితే గానీ, నవ్వించే వీలు దక్కడం లేదు. క్యాచీ టైటిల్‌ని పెట్టి, కామెడీ గుంపుని రంగంలోకి దిగితే కామెడీ వచ్చేయదు. ఈ విషయం తెనాలి రామకృష్ణని చూస్తే అర్థం అవుతుంది.
ఫినిషింగ్ టచ్: 2 గంటల కఠిన కారాగార శిక్ష విధించడమైనది
తెలుగు360 రేటింగ్: 1.5/5