తెలుగు360 రేటింగ్: 2.5/5
విశాల్ సినిమా అంటేనే యాక్షన్ ఫుల్‌గా ఉంటుంది. ఇక యాక్షన్ అని పేరు పెడితే… ఆ యాక్షన్ ఏ రేంజులో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా? కేవలం యాక్షన్ కోసం యాక్షన్ అన్నట్టు సాగి, మధ్యలో కొన్ని ట్విస్టులు, టర్న్‌లూ ఇచ్చుకుంటూ తీసిన సినిమా `యాక్షన్`. తమన్నా కథానాయిక కావడం, రీసెంట్ గా విశాల్‌కి `డిటేక్టీవ్` లాంటి హిట్ పడడంతో – `యాక్షన్` సినిమాపై ఫోకస్ పడింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? యాక్షన్ ఇరగదీశాడా?
కథ
సుభాష్ (విశాల్) ఓ ఆర్మీ అధికారి. తండ్రి ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అన్నయ్య కాబోయే ముఖ్యమంత్రి. అయితే అనుకోకుండా అన్నయ్య చనిపోతాడు. ప్రియురాలు చంపబడుతుంది. వీటన్నింటికీ కారణం.. మాలిక్ (కబీర్ సింగ్) అనే ఓ తీవ్రవాది. అతన్ని పట్టుకోవడం అంత సులభం కాదు. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌గా ముద్ర పడిన మాలిక్.. ప్రస్తుతం పాకిస్థాన్‌లో రాజభోగాలు అనుభవిస్తూ, అక్కడి ప్రభుత్వాన్ని కూడా శాశిస్తుంటాడు. మరి అలాంటి ఉగ్రవాదిని సుభాష్ ఎలా పట్టుకున్నాడు? ఈ ఆపరేషన్‌లో దియా (తమన్నా) తనకు ఎలా సహాయం చేసింది? అనేదే యాక్షన్ సినిమా.
విశ్లేషణ
ముందే చెప్పినట్టు ఇది పూర్తి యాక్షన్ చిత్రం. సీన్ నెంబర్ వన్‌లోనే ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది. ఇంట్రవెల్ బ్యాంగ్ కూడా ఓ యాక్షన్ ఎపిసోడ్‌తోనే. ద్వితీయార్థంలో రన్నింగులూ, ఛేజింగులూ కనిపిస్తాయి. దాన్ని బట్టి యాక్షన్ అనే టైటిల్‌కి ఎంత న్యాయం చేశారో అర్థం చేసుకోవచ్చు. అయితే వీటి మధ్య కథని ఇరికించడం మర్చిపోయాడు దర్శకుడు. ముఖ్యమంత్రి ఇంటిలో దూరి వాళ్లబ్బాయిని చంపి దర్జాగా బయటకు వెళ్లిపోవడం ఇంత తేలికా..? అనేపించేలా ఓ సీన్ ఉంటుంది. దాన్ని బట్టి.. సుందర్ సి. లాజిక్కులు అస్సలు వేసుకోలేదనిపిస్తుంది. పాకిస్థాన్‌లో ఉన్న ఉగ్రవాదిని తీసుకురావడంలోనూ దర్శకుడు తన తెలివితేటల్ని ఏమాత్రం వాడలేదు. దాని కోసం అక్షయ్ కుమార్ సినిమా `బేబీ`లోని సీన్లు లేపేశాడు. చాణక్యలోని డబుల్ డూప్ పాయింట్ కూడా ఈ సినిమాలో కనిపిస్తుంది. అంటే… నాలుగైదు సినిమాల్ని దర్జాగా కాపీ చేసి, వాటి మధ్య యాక్షన్ సన్నివేశాల్ని ఇరికించాడన్నమాట.
విశ్రాంతి ముందొచ్చే యాక్షన్ సీన్ రొమాంఛితంగా సాగుతుంది. మరీ ముఖ్యంగా ఇంట్రవెల్ బ్యాంగ్ కోసం వేసిన షాట్.. తప్పట్టు కొట్టిస్తుంది. ఇలాంటి మెరుపులు మరిన్ని ఉండుంటే.. యాక్షన్ తప్పకుండా బేబీ లాంటి సినిమా అయ్యేది. కానీ… దర్శకుడు అతి తెలివికిపోయి.. బేబీనే కాపీ చేసేశాడు. దాంతో ఉస్సూరుమనిపిస్తుంది. ఓ తీవ్రవాదిని పట్టుకోవడానికి శత్రుదేశం వెళ్లడం, అక్కడ స్ట్రింగ్ ఆపరేషన్ చేయడం ఇవన్నీ ఈమధ్య వస్తున్న టెర్రరిస్ట్ బ్యాక్‌డ్రాప్ కథాంశాలే. ఈ యాక్షన్ కూడా వాటి చుట్టూనే తిరిగింది. టర్కీ, లండన్ అంటూ లొకేషన్లు మారినా అదే కథ, అదే వ్యవహారం. ప్రేక్షకులు కేవలం యాక్షన్ కోసమే సినిమాలకు రారు. నవ్వుకోవడానికే రారు. కన్నీరు పెట్టుకోవడానికే రారు. వాళ్లకి అన్నీ ఇవ్వాలి. ఆ విషయంలో ఈ సినిమా విఫలమైంది. ప్రధమార్థంలో లవ్ ట్రాక్ పండలేదు. తమన్నాతో హీరోకి ఎలాంటి కెమిస్ట్రీ వర్కవుట్ అవ్వలేదు. కామెడీలాంటివి ఆశించడం కూడా తప్పే. కేవలం యాక్షన్‌ని చూడ్డానికే ఈ సినిమాకి వెళ్లాలి.
నటీనటులు
విశాల్ అలవాటు ప్రకారం కష్టపడ్డాడు. యాక్షన్ సన్నివేశాల్లో అతని కష్టం మరింత తెలుస్తుంది. తమన్నాకి ఇది కొత్త పాత్రే. తొలి సగం గడిచాక… అసలు ఈ సినిమాలో తమన్నా ఉందా? అనే అనుమానం వేస్తుంది. కానీ ద్వితీయార్థంలో విశాల్‌తో పోటీ పడి మరీ రిస్కులు చేసింది. మరదలిగా నటించిన ఐశ్వర్య, కాస్త ఫైటింగులు చేసిన ఆకాంక్ష పూరి – ఆకట్టుకున్నారు. తమన్నా కంటే ఆకాంక్ష పూరినే గ్లామరెస్‌గా కనిపించింది. యోగిబాబు కామెడీ ఈసారి నవ్వించలేదు.
సాంకేతిక వర్గం
హిప్ ఆప్ తమిళ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. పాటలు మైనస్. కాకపోతే ఆకాంక్ష పూరిపై తెరకెక్కించిన పాటలో టెంపో బాగుంది. యాక్షన్ సన్నివేశాలు, వాటిని తెరకెక్కించిన విధానం నచ్చుతాయి. డబ్బుల్ని వెదజల్లారు. సుందర్ యాక్షన్‌లో కథని కంపోజ్ చేయడం మర్చిపోయాడు. ఓ పాత కథని తీసుకొచ్చి.. బాగా నిరాశ పరిచాడు. దాంతో యాక్షన్ బాగున్నా.. దాని చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు తేలిపోయాయి.
ఫినిషింగ్ టచ్: ఇది విశాల్ ‘బేబీ’
తెలుగు360 రేటింగ్: 2.5/5