దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ శనివారం జైలు నుంచి విడుదల కానున్నారు. ఆయనపై నమోదైన అన్ని కేసుల్లోనూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం ఆయన ఏలూరు జిల్లా జైల్లో ఉన్నారు. చింతమనేని మొదటగా సెప్టెంబర్ 11వ తేదీన అరెస్ట్ చేశారు. అప్పట్నుంచి.. బయటకు రాకుండా పోలీసులు కేసుల మీద కేసులు పెడుతున్నారు. అన్నీ ఒకే సారి కాకుండా.. ఒక కేసులో రిమాండ్ పూర్తయితే.. బెయిల్ వస్తుందని క్లారిటీ వస్తే.. ఆ వెంటనే.. మరో కేసు పెట్టి.. పీటీ వారెంట్‌పై మరోసారి అరెస్ట్ చూపిస్తున్నారు.
దీంతో ఇప్పటి వరకూ.. దాదాపుగా ఇరవైకిపైగా కేసులు పెట్టారు. చింతమనేనిని నారా లోకేష్ సహా. టీడీపీ ముఖ్యనేతంలదరూ పరామర్శించారు. ఇప్పటికీ.. వారానికొకరు చొప్పున జైలుకి వెళ్లి చింతమనేనికి ధైర్యం చెప్పి వచ్చారు. ఇంటికి వెళ్లి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పోలీసుల తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు కూడా మండిపడ్డారు. ఇలాంటి తప్పుడు కేసులతో వేధించేవారికి వడ్డీతో సహా చెల్లిస్తామని వార్నింగ్ ఇచ్చారు. చివరికి రెండు నెలల తర్వాత కోర్టు అన్ని కేసుల్లోనూ బెయిల్ మంజూరు చేసింది. శనివారం చింతమనేని విడుదల కానున్నారు.
వైసీపీ సర్కార్ ఏర్పడిన తర్వాత.. టీడీపీ నేతలు చాలా మందిపై కేసులు పెట్టారు కానీ.. చింతమనేనిని మాత్రం.. డెడ్లీగా టార్గెట్ చేశారు. స్వయంగా ఎస్పీనే.. చింతమనేని ప్రభాకర్ పై . ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చని పిలుపునిచ్చారు. దీంతో.. వైసీపీ నేతలు.. ఒక్కొక్కర్ని తీసుకొచ్చి ఫిర్యాదులిప్పిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇతర కేసుల్లో అయితే అరెస్ట్ చూపడం సాధ్యం కాదు కాబట్టి. స్టేషన్ బెయిల్ కు అవకాశం లేని ఎస్సీ, ఎస్టీ కేసులే ఎక్కువగా నమోదు చేశారని చింతమనేని అనుచరులు ఆరోపణలు గుప్పించారు. ఎట్టకేలకు చింతమనేని విడుదలవుతున్నారు.