ఆంధ్రుల రాజధాని ఏదన్న ప్రశ్నకు ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. ప్రభుత్వమే అమరావతిని గుర్తించడానికి సిద్ధపడటం లేదు. రాజధాని అమరావతి కాదని..మంత్రులు చెబుతున్నారు. తాము సొంతంగా నిపుణుల కమిటీని నియమించామని.. వారు నివేదిక ఇస్తారని… ఆ నివేదిక ఆధారంగా రాజధాని ఎక్కడ ఉండాలో ఖరారు చేస్తామని చెబుతున్నారు. అయితే..ఈ నిపుణుల కమిటీ చట్ట విరుద్ధమంటూ..రాజధాని రైతులు హైకోర్టుకు వెళ్లారు. వరుసగా పిటిషన్లు వేస్తున్నారు. హైకోర్టు అటు రాష్ట్ర ప్రభుత్వానికి.. ఇటు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు దాఖుల చేయాలని ఆదేశించింది. అంటే.. రాజధాని వ్యవహారం.. హైకోర్టుకు చేరినట్లే.
ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి అమరావతి నిరాదరణకు గురవుతూనే ఉంది. ప్రభుత్వ పెద్దలకు.. అమరావతిలో ఒక్క సామాజికవర్గం వారే కనిపిస్తున్నారు. అది వారికి నచ్చడం లేదు. ఒక్క సామాజికవర్గం కోసమే.. తాము రాజధాని కట్టబోమని.. మంత్రి బొత్స సత్యనారాయణ అడిగినా.. అడగకపోయినా.. చెబుతున్నారు. రాజధాని మారుస్తారంటూ.. ఎన్నో సార్లు ప్రచారం జరిగింది. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో.. హైకోర్టు, సచివాలయం.. అసెంబ్లీ.. వివిధ శాఖల కార్యాలయాలు.. ఒక్కో చోట పెడతారన్న చర్చ కూడా జరుగుతోంది. నిపుణుల కమిటీ ఇవ్వబోయే నివేదికలో ఇలానే ఉంటుందని…ఇప్పటికే.. ప్రభుత్వ వర్గాలు లీకులు ఇవ్వడం ప్రారంభించాయి కూడా.
రాజధాని విషయాన్ని తెలుగుదేశం పార్టీ కేంద్రం వద్దకు తీసుకెళ్తోంది. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన అమరావతి పై కేంద్రం వైఖరిలో ఏమిటో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం రాజధానికి 1500 కోట్లు కేటాయించిందని.. కేంద్రానికీ బాధ్యత ఉందని అంటున్నారు. పార్లమెంట్లో ప్రస్తావిస్తామని టీడీపీ ఎంపీలు ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ఆరు నెలలకే అమరావతిని రాజధానిగా గత ప్రభుత్వం ఖరారు చేసింది. కానీ ఐదేళ్లు గడిచిన తర్వాత …ప్రభుత్వం మారిన తర్వాత ఆరు నెలలకు.. అదే రాజధానిపై అనిశ్చితి ఏర్పడింది. కేంద్రం ఎలా స్పందింస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరం.