22 మంది ఎంపీలున్నాయి. పార్లమెంట్లో మూడో అతి పెద్ద పార్టీ. కేంద్రంతో సన్నిహిత సంబంధాలు. పార్టీ పార్లమెంటరీ నాయకుడిని.. ప్రధాని ఆప్యాయంగా.. హాయ్ ..విజయ్ గారూ.. అని పిలిచే సాన్నిహిత్యం ఉంది. కానీ.. ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన నిధుల విషయంలో.. కానీ.. దక్కాల్సిన ప్రాజెక్టుల విషయంలో కానీ.. వీసమొత్తు న్యాయం జరగడం లేదు. పోలవరం ప్రాజెక్ట్‌కు ఇవ్వాల్సిన రూ. ఐదు వేల కోట్లలో.. నిన్నామొన్న.. రూ. 1800 కోట్లు ఇస్తున్నట్లుగా ప్రకటించారు. మిగతా వాటి సంగతేమిటని గట్టిగా అడగలేని పరిస్థితి ఉంది.
పోలవరం సవరించిన అంచనాలు రూ.55,549.87 కోట్లకు ఆమోదం ఎప్పటికప్పుడు ఆలస్యం అవుతోంది. వచ్చే ఏడాది కాఫర్ డ్యాం పూర్తవుతుంది. అప్పుడు నీరు 41.5 మీటర్ల వరకూ నీరు నిల్వ ఉంటుంది. ఈ కారణంగా ఈ ఏడాది పోలవరం ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అవసరం. కానీ.. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీతో తమకు పని లేదని.. కేంద్రం వాదిస్తోంది. ఈ విషయాన్ని గట్టిగా అడగలేని పరిస్థితి వైసీపీకి ఉంది. ఆర్ అండ్ ఆర్ లేకపోతే.. ప్రాజెక్టు పూర్తి కాదు. నీరు నిల్వ చేయలేరు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా వెనుకబడిన జిల్లాలకు ఏడాదికి రూ. 350 కోట్ల చొప్పున ఇప్పటివరకూ రూ.7530 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటి వరకు రూ.1050 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఒకసారి నిధులు ఇచ్చి వెనక్కి తీసుకున్నారు. ఇప్పటి వరకూ మళ్లీ విడుదల చేయలేదు.
ఏపీ తీవ్రమైన ఆర్థిక కష్టాల్లో ఉంది. గత ఆరు నెలలుగా.. ఒక్క అభివృద్ధి పని కూడా ముందుకు కదలలేదు. వివిధ కారణాలతో.. ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. కాంట్రాక్టర్లు మారిపోయారు. వారికి అడ్వాన్సులు చెల్లించి.. పనులు ప్రారంభించడానికి కూడా ప్రభుత్వం వద్ద నిధులు లేవు. ఇలాంటి సమయంలో.. కేంద్రం ఆదుకుంటేనే.. ముందుకు కదులుతుంది. కానీ.. గట్టిగా మాట్లాడలేకపోతున్నారు వైసీపీ ఎంపీలు. ఏ ఒక్కరూ మాట తూలవద్దని.. జగన్మోహన్ రెడ్డి.. ఎంపీలతో జరిగిన సమావేశంలో ప్రత్యేకంగా చెప్పారు. కాబట్టి.. వారెవరూ.. ఢిల్లీలో నోరు మెదిపే అవకాశం ఉండదు. కేంద్రమంత్రులను కలిసి వినతి పత్రాలివ్వడంతోనే సరిపోయే అవకాశం ఉంది.