సినిమాకి కథే మూలం.
కథే బలం.
కథే హీరో. కథే అన్నీ.
కథ లేకపోతే సినిమానే లేదు. కథని నిర్లక్ష్యం చేస్తే.. సినిమానే రాదు.
– ఈ మాటలు తరచూ వింటుంటాం. బడా హీరోలు సైతం తమ ప్రెస్ మీట్లలో చెప్పే మాటలు ఇవే. స్టార్ డమ్ వల్ల సినిమాలు ఆడవని, కథలుంటేనే నడుస్తాయని కుండ బద్దలు కొట్టినట్టు చెబుతుంటారు. కానీ ఆ కథే నిర్లక్ష్యం అవుతోంది.
చిత్రం ఏమిటంటే… ఆ కథని వినడానికే ఏ హీరో దగ్గరా, ఏ నిర్మాత దగ్గరా సమయం ఉండడం లేదు.
అవును… తెలుగు చిత్రసీమలో కథల కొరతకు నిజంగా హీరోలే కారణం. ఫిల్మ్‌నగర్‌లో కొత్త కథలు పట్టుకుని తిరుగుతున్నారు. వాళ్లని ఎవ్వరూ ఎలాగూ పట్టించుకోరు. కానీ.. ఒకట్రెండు హిట్లు కొట్టిన యువ దర్శకుల కథలు కూడా వినడానికి మన హీరోలకు తీరిక లేదు. ఎవరిదో ఒకరి బలమైన రికమెండేషన్ ఉంటే తప్ప.. కథలు వినని పరిస్థితి పట్టుకుంది. ఇది దర్శకులకు శాపంగా మారింది. ఎప్పుడైతే ఓ మంచి కథ హీరోల వరకూ చేరలేదో, అప్పుడు ఆ కథ పురుడులోనే పాడెక్కేస్తోంది. అలా సిల్వర్ స్క్రీన్ పైకి రావల్సిన మంచి కథలు రాకపోవడం – చిత్రసీమకు తీరని లోటే.
ఈమధ్య ఓ దర్శకుడు ఓ హీరోకి కథ చెప్పాలనుకున్నాడు. చాలారోజులు ఫోన్లు చేశాడు. కానీ.. హీరోగారు స్పందించలేదు. ఆ దర్శకుడు మరో పెద్ద దర్శకుడ్ని పట్టుకుని హీరోగారికి రికమెండేషన్ చేసుకుంటే గానీ, కథ చెప్పుకోవడానికి అవకాశం దొరకలేదు. తీరా అక్కడి వరకూ వెళ్లాక…. `నా చేతిలో ఇప్పుడు చాలా సినిమాలున్నాయి. సారీ అని చెప్పి పంపించేశాడు. మరి ఆ హీరోగారు అన్నీ బలమైన, అద్భుతమైన కథలే ఎంచుకుంటున్నారంటే.. అదీ లేదు. సూపర్ హిట్ కాంబినేషన్లమీద ఆధారపడి సినిమాలు తీస్తుకుంటూ వెళ్తున్నాడు. హిట్టు కొట్టిన దర్శకుడి పరిస్థితే ఇలా ఉంటే, మిగిలినవాళ్ల మాటేంటి..?
హీరోల దగ్గర కథలు వినడానికి సమయం ఉండదు. ఒకవేళచెప్పాలనుకున్నా హీరోల మేనేజర్లు, వాళ్ల బాబాయ్‌లకు చెప్పాలి. వాళ్లకు నచ్చితే అది హీరో వరకూ వెళ్తుంది. బాబాయ్‌లు, భార్యలూ హీరోల కథల్ని ఎలా జడ్జ్ చేయగలరన్నది దర్శకుల ఆవేదన. కానీ బయటపడకూడదు. ఇలా ఏమైనా మాట్లాడితే హీరోల మనసులు హర్టయిపోతాయి. భవిష్యత్తులో ఓ అవకాశం ఇవ్వాలనుకున్నా, అది చేతికి అందదేమో అన్నది దర్శకుల భయం. ఇంకొన్ని సందర్భాల్లో మరికొన్ని విచిత్రాలు జరుగుతుంటాయి. `ఇలాంటి ఇలాంటి దినుసులతో.. ఇలాంటి కథ చేయ్` అంటూ కొన్ని సీడీలు ఇచ్చి, వాటికి తగ్గట్టుగా కథలు వండించుకుంటుంటారు హీరోలు. అలాంటప్పుడు తప్పకుండా పాత కథలే వస్తుంటాయి. కొత్త కథలకు ఛాన్సెక్కడ దొరుకుతుంది..? హీరోలకు కావల్సిన అంశాలతో కథలు వండడం మొదలెడితే, ఇక మెదళ్లు ఎప్పుడు పనిచేస్తాయ్? ఎక్కడ పనిచేస్తాయ్..?
దిల్‌రాజు దగ్గర కథల బ్యాంక్ ఉండేది. ఆయన దగ్గర ఏడెనిమిది సినిమాలకు సంబంధించిన స్క్రిప్టులు తయారవుతూ ఉండేవి. కానీ.. ఇప్పుడు ఆయన కూడా కథల్ని లైట్ తీసుకోవడం మొదలెట్టార్ట. దిల్ రాజు స్వయంగా కథ విని చాలా కాలం అయ్యిందని, ఆయన తన సహచరులకు ఆ బాధ్యత అప్పగించారని, దిల్‌రాజు కున్న జడ్జ్మెంట్ వాళ్లకు ఉంటుందన్న గ్యారెంటీ ఏముందని ఆయన కాంపౌండ్ చుట్టూ తిరిగిన కొంతమంది యువ రచయితలు, దర్శకులు చెబుతున్నారు. అదీ కరెక్టే. గీతా ఆర్ట్స్, సురేష్ ప్రొడక్షన్స్ దగ్గర స్టోరీ డిపార్ట్మెంట్ ఉంది. దాని వల్ల కొన్ని మంచి ఫలితాలు వస్తున్నాయి. ప్రతీ హీరోకీ ఓ స్టోరీ డిపార్ట్మెంట్ ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. ప్రతీ కథా హీరో వినకపోవొచ్చు. కానీ… దానికంటూ ఓ విభాగం ఉంటే, కనీసం కొన్ని మంచి కథలైనా హీరోల వరకూ వెళ్లే అవకాశం ఉంటుంది. కొత్త కథల్ని ప్రొత్సహించినప్పుడు, యువ ప్రతిభావంతులకు అవకాశాలు ఇచ్చినప్పుడే కదా… కొత్త స్ఫూర్తి రగిలేది..? కోట్లు పోసి రీమేక్‌లు కొనడం కంటే, ఇంగ్లీషు సీడీలు చూసి సినిమాలు తయారు చేయడం కంటే.. కొంతలో కొంత సమయం కేటాయించి, నవతరం దర్శకులు, కథకుల ఆలోచనల్ని అర్థం చేసుకోగలిగితే… తప్పకుండా కొత్త తరహా సినిమా చూసే అవకాశం దక్కుతుంది. హీరోలు ఆ దిశగా ఆలోచిస్తే మంచిదేమో..??