వల్లభనేని వంశీ పార్టీ మార్పు వివాదంలోకి.. అయ్యప్పస్వామి మాల నీతి, నియమాలు చొచ్చుకు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి అయ్యప్ప మాలలో ఉన్న వంశీతో.. అసభ్యంగా మాట్లాడిస్తూ.. హిందూధర్మంపై అందరికీ చిన్నచూపు పడేలా చేస్తున్నారని.. టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అదే సమయంలో… మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా అయ్యప్ప దీక్షాధారణలో ఉన్నారు. అయితే.. ఆయన ఎక్కడ చూసినా.. చెప్పులతోనే కనిపిస్తున్నారు. ఈ ఫోటోలో సోషల్ మీడియాలో తిరుగుతూనే ఉన్నాయి. ఈ కారణంగా అటు వల్లభనేని వంశీ మాటలను.. ఇటు అవంతి శ్రీనివాస్ చెప్పుల విహారాన్ని వివరిస్తూ.. అంతా జగన్ వల్లేనని మండి పడుతున్నారు.
వల్లభనేని వంశీ.. చంద్రబాబు దీక్ష చేసిన రోజున ప్రెస్ మీట్ పెట్టి కాస్త పద్దతిగానే మాట్లాడారు. అయితే.. ఆ వివాదాన్ని మరింత చర్చనీయాంశం చేయాలన్న సూచనలు వచ్చాయేమో కానీ.. టీవీచానల్ చర్చల్లో కూర్చుని.. బండ బూతులు తిట్టడం ప్రారంభించారు. తనను ప్రశ్నించిన వారిపై.. విరుచుకుపడ్డారు. ఆయన మాటలు.. రెండో రోజు కూడా కొనసాగాయి. రెండో రోజు.. చంద్రబాబు, లోకేష్‌లపై ఆయన విరుచుకుపడ్డారు. ఈ మాటలు సభ్యతను దాటి.. సంస్కార హీనంగా ఉన్నాయని.. అదీ కూడా.. నిన్నామొన్నటిదాకా ఆ పార్టీలో ఉంటూ… బయటకు వచ్చి ఇలా మాట్లాడటం ఏమిటన్న చర్చ సహజంగానే ప్రారంభమయింది. ఆయన మాలలో ఉండటంతో టీడీపీ నేతలు.. నియమాల విషయాన్ని తెరపైకి తెచ్చారు.
వంశీ మాట తీరు అది కాదని.. ఆయనతో జగన్ మాట్లాడిస్తున్నారని టీడీపీ నేతలు మండి పడుతున్నారు. అయ్యప్ప మాలలో ఉన్నవారితో మాట్లాడిస్తూ… జగన్ హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ నేరుగానే మండిపడ్డారు. నిష్ఠతో ఉండాల్సిన అయ్యప్పస్వాముల పవిత్రతను జగన్ దెబ్బతీస్తున్నారన్నారు. ఒక్క టీడీపీ నేతల నుంచే.. కాదు… అయ్యప్ప దీక్షను పవిత్రంగా చూసే భక్తుల్లోనూ.. వంశీ , అవంతి శ్రీనివాస్‌ల తీరుపై అసహనం కనిపిస్తోంది. వారు.. ఇంకెంత మాత్రం అయ్యప్పదీక్షను కొనసాగించడానికి అర్హులు కాదని.. తక్షణం శుద్ధి చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.