ఎప్పుడూ లేని విధంగా ఈ సంక్రాంతికి సినిమాల పోటీ బాగా జరిగింది. బాలకృష్ణ, నాగార్జున, ఎన్టీఆర్, శర్వానంద్… ఇలా నలుగురు హీరోల సినిమాలు మూడు రోజుల గ్యాప్‌లో రిలీజ్ అయి సంక్రాంతి సందడిని మరింత పెంచాయి. అయితే ఈ నాలుగు సినిమాల్లో దేనికీ డిజాస్టర్ టాక్ రాకపోవడం గొప్ప విశేషంగా చెప్పుకోవాలి. కలెక్షన్లపరంగా అందరూ సేఫ్ అయ్యారు. సంక్రాంతి సినిమాల పోటీ ఎలా వుంటుందో? ఏ సినిమాకి నష్టం జరుగుతోందోనని టెన్షన్ పడిన ట్రేడ్ వర్గాలు ఆయా సినిమాల రిజల్ట్ చూసి రిలాక్స్ అయ్యాయి.
ఇప్పుడు మరో పోటీకి రంగం సిద్ధమవుతోంది. ఇప్పటి నుంచే హీరోలు తమ రిలీజ్ డేట్స్‌ని ఎనౌన్స్ చేస్తూ సమ్మర్‌ని ఇప్పటి నుంచే వేడెక్కిస్తున్నారు. ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఏప్రిల్ 8న రిలీజ్ చేసెయ్యాలని షూటింగ్ ఫాస్ట్‌గా చేసేస్తున్నాడు పవర్‌స్టార్. మరో పక్క అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మిస్తున్న ‘సరైనోడు’ చిత్రాన్ని కూడా సమ్మర్లోనే ఏప్రిల్ 7గానీ, 8న గానీ రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. పవన్‌కళ్యాణ్‌గానీ, అల్లు అర్జున్‌గానీ ఈ రిలీజ్ డేట్ విషయంలో వెనక్కి తగ్గేది లేదని చెప్తున్నారట. ఈ రెండు సినిమాలు కాక అదే నెలలో చాలా సినిమాలు రిలీజ్ అవబోతున్నాయి. మరి ఈ ఇద్దరు హీరోల పోటీ మిగతా సినిమాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.