రాజమౌళి బుర్రే బుర్ర. ఓ సినిమాని ఎలా బిజినెస్ చేసుకోవాలో, ఓ సినిమా గురించి జనం మాట్లాడుకోవాలంటే ఏం చేయాలో ఆయనకు బాగా తెలుసు. రాజమౌళి మార్కెట్ స్ట్రాటజీ గురించీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. `బాహుబలి`ని ఎన్ని రూపాల్లో జనంలోకి తీసుకెళ్లాలో అన్ని రూపాల్లోనూ తీసుకెళ్లారు. ఇప్పుడు మరో సరికొత్త ఆలోచన చేస్తున్నారు. బాహుబలిని మళ్లీ విడుదల చేసి క్యాష్ చేసుకోవాలన్నది ఆయన ప్లాన్.
బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కన్‌క్లూజన్ అంటూ రెండు భాగాలు విడుదలయ్యాయి. రెండూ సంచనల విజయం సాధించాయి. ఇప్పుడు ఈ రెండు భాగాల్నీ కలిపి ఓ సినిమాగా విడుదల చేయనున్నారు. ఇంట్రవెల్ వరకూ ఓ భాగం, ఆ తరవాత మరో భాగం. కొన్ని పాటల్ని, సన్నివేశాల్నీ ట్రిమ్ చేసి ఐదున్నర గంటల సినిమా కాస్త గంటలకు కుదిస్తారన్నమాట. ఇప్పటికే ఈ ట్రిమ్మింగ్ అయిపోయింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. తమిళ సినిమాకి సంబంధించిన సెన్సార్ కూడా ఇటీవలే పూర్తయ్యింది. తెలుగులో ఇంకా జరగాల్సివుంది. అయితే… ఇప్పటికే బుల్లి తెరపై ఈ సినిమాని చాలాసార్లు చూశారు తెలుగు ప్రేక్షకులు. డీవీడీలు సైతం అరిగిపోయి ఉంటాయి. అయినా సరే, రాజమౌళికి జనాన్ని థియేటర్లకు రప్పించడం ఎలాగో తెలుసు. ఆయన ఏదో ఓ మ్యాజిక్ చేస్తారు. రీ రిలీజ్ వల్ల ఎంతొచ్చినా లాభాలే కదా..? పైగా బాహుబలి అన్నది ఓ బ్రాండ్‌గా మారిపోయింది. ట్రిమ్ చేసిన తరవాత ఎలా ఉందో.. అనే ఉత్సుకతతో అయినా జనాలు వస్తారని ఆశ. అప్పట్లో వాడని సన్నివేశాలేమైనా జోడిస్తే.. అది అదనపు ఆకర్షణ అవుతుంది. మరి రాజమౌళి మైండ్‌లో ఏముందో..?