ఒక్క చాన్స్ అని… రాజన్న బిడ్డనంటూ.. సెంటిమెంట్ పండించేసరికి… ఓటును ఏకపక్షంగా ధారాదత్తం చేసేశారు ఏపీ ఓటర్లు. ఇప్పుడు ఏం జరుగుతోంది..? వాళ్ల కడుపు ఆకలితో మండిపోతోంది. భవిష్యత్ ప్రశ్నార్థకయింది. కులంతో కడుపు నింపుతామన్నట్లుగా ఇతరులపై విద్వేషాన్ని నింపి.. తమ కుర్చీని .. ఒక్క చాన్స్ పాలనను గట్టిపరుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వారు బాగానే ఉన్నారు. మట్టికొట్టుకుపోతోంది ఏపీ ప్రజలే.
పేదల కడుపు కొట్టిన ఒక్క చాన్స్..!
గత ఆరు నెలల కాలంలో… ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన తీరుపై దేశవ్యాప్తంగా ఓ రకమైన భయానక స్పందన కనిపిస్తోంది. అసెంబ్లీలో 151 అసెంబ్లీ స్థానాలలో ప్రజలు గెలిపిస్తే వచ్చిన ఐదు నెలలు లోనే 35 లక్షల భవన నిర్మాణ కార్మికుల ఉపాధిని పోగొట్టారు. 50మందికిపైగా ఆత్మహత్యలకు కారణమయ్యారు. ఆరు నెలల కాలంలో జగన్ పై ఏర్పడిన ఇమేజ్ వినాశకరమైనదే. ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయడానికి ప్రజాస్వామ్య విరుద్ధమైన పద్దతుల్ని వాడుతున్నారు. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడానికి సమయం కేటాయిస్తున్నారు. కక్ష పూరిత ఆలోచనలతో.. ఏపీలో అభివృద్ధిని పడకేసేలా చేసే నిర్ణయాలతో.. దేశ పెట్టుబడుల వాతావరణాన్ని దెబ్బతీశారు. పేర్లు, రంగుల పిచ్చితో… దేశం మొత్తానికి పిచ్చి పట్టేలా చేశారు. విద్యార్థులకు ఇచ్చే అవార్డులకు అబ్దుల్ కలాం పేరు తీసేసి.. వైఎస్ఆర్ పేరు పెట్టారు. అబ్దుల్ కలాంను.. ఇంత ఘోరంగా అవమానించిన వారు మరొకరు లేరని.. అందరూ నోళ్లు నొక్కుకున్నారు. ఇక జగన్ సొంత ఇంటికి ప్రజాధనం రూ. 15 కోట్లు ఖర్చు పెట్టుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ను మరో బీహార్‌లా మార్చింది కూడా ఒక్క చాన్సే..!
దేశంలో ఈ దుస్థితికి జగన్ కూడా ఓ కారణం. సింగపూర్ ప్రభుత్వం అమరావతి ప్రాజెక్ట్ నుండి వెనక్కి తగ్గడంతో.. ఇతర విషయాలపైనా.. ఇంటర్నేషనల్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఏపీనే కాదు.. ఇండియా బ్రాండ్ ఇమేజ్ ను జగన్ దెబ్బతీశారు. గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేయడానికి జగన్ సర్కార్ చేసిన ప్రయత్నాలు.. విద్యుత్ కొనుగోళ్లు నిలిపివేత వంటి అంశాలు.. ఇతర దేశాల్లోనూ హైలెట్ అయ్యాయి. విశాఖలో ఉన్న మెడ్‌టెక్ జోన్ సీఈవోను ప్రభుత్వం సాగనంపింది. నరేంద్రమోడీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్‌లో భాగంగా.. పలు అంతర్జాతీయ సంస్థలు మెడ్ టెక్ జోన్లో పెట్టుబడులు పెట్టాయి. ఉత్పత్తి కూడా ప్రారంభించాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ గట్టి షాక్.
గుర్తించకుండా కళ్లకు కుల, మతాల పొర కప్పుతున్న పాలకులు..!
ఒక్క ఓటే కదా.. అని ప్రజలు అనుకున్నారు. కానీ ఒక్క ఓటే.. రాత మారుస్తోంది. ఇంత కాలం పాలకులు.., ప్రజలను ఇబ్బంది పెట్టకుండా.. తమ రాజకీయాలు తాము చేసేవాళ్లు. వీలైతే అభివృద్ధి చేసేవాళ్లు. కానీ ఇప్పుడు ప్రజలు వేసిన ఒక్క ఓటుకి… అభివృద్ధి లేదు.. ప్రజల సంక్షేమం లేదు. తలా పది రూపాయలు పంచి.. మిగతాది.. తాను చూసుకుంటానన్నట్లుగా ఉంది పాలన. కక్ష సాధింపులు.. ప్రత్యర్థి పార్టీలపై కాదు.. ప్రజలపై చేస్తున్నట్లుగా ఉంది. ఏపీకి అంతర్జాతీయంగా చెడ్డపేరు. ఒక్క ఓటు ఎంత పని చేసిందో.. ఇప్పటికైనా గుర్తిస్తారా..? అలా గుర్తించకుండా.. కుల, మతాల పొరను… పాలకులు ఇప్పటికే కప్పేశారా..?