ఆర్టీసీ సమ్మె వ్యవహారం ఇవాళ్ల మరో మలుపు ఇది. సమ్మె అంశం హైకోర్టులో ఏదో ఒకటి తేలిపోతుందీ అనుకుంటే… అక్కడేం జరగదని ఇవాళ్ల తేలిపోయింది! సమ్మె వ్యవహారాన్ని లేబర్ కమిషన్ కి బదిలీ చేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. తమకు కొన్ని పరిమితులు ఉంటాయనీ, వాటిని దాటి ముందుకెళ్లలేమని వ్యాఖ్యానించిన న్యాయస్థానం… రెండువారాల్లో సమ్మెకు పరిష్కారం ఇచ్చే దిశగా చర్యలు తీసుకోవాలంటూ లేబర్ కమిషనర్ కి ఆదేశాలిచ్చింది. దీంతోపాటు, ప్రజల ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే సమ్మె ఆపేయాలంటూ కార్మికులను కూడా కోర్టు కోరింది.
నిజానికి, ఆర్టీసీ సమ్మె వ్యవహారాన్ని లేబర్ కమిషన్ కి బదిలీ చేయాలంటూ మొదట్నుంచీ ప్రభుత్వం వాదిస్తూ వస్తోంది. అయితే, ప్రజలూ కార్మికుల తరఫు నుంచే కోర్టు గత కొద్దిరోజులుగా స్పందిస్తూ వచ్చింది. ప్రజలు తిరగబడితే పరిస్థితి వేరేలా ఉంటుందంటూ వ్యాఖ్యానించింది. చర్చలు జరపాలంటూ ప్రభుత్వాన్నీ కోరింది. ఆర్టీసీ యాజమాన్యం దాఖలు చేసిన లెక్కలపై విమర్శించింది. యూనియన్ నేతలే సమ్మె పేరుతో ఆర్టీసీకి నష్టాలు తెస్తున్నారంటూ యాజమాన్యంతోపాటు, ప్రభుత్వం కూడా వేర్వేరుగా కోర్టు ముందు వాదనలు వినిపించింది. చివరికి వచ్చేసరికి, తమ పరిధి దాటి వ్యవహరించలేమంటూ లేబర్ కమిషన్ కు వ్యవహారాన్ని బదిలీ చేసింది. అయితే, సమ్మె చట్ట విరుద్ధమంటూ ప్రకటించాలని ప్రభుత్వం కోరినా… అది సాధ్యం కాదంటూ కోర్టు చెప్పింది. ఈ కేసు హైకోర్టు పరిధిలోకి రాదనీ, సమ్మెను చట్టవిరుద్ధమని ప్రకటించాలన్నా లేబర్ కోర్టు చేయాల్సిందేననీ, ఇండస్ట్రియల్ డిస్ ప్యూట్ యాక్ట్ ప్రకారం అక్కడే నిర్ణయం జరగాలని మీడియాతో ఓ న్యాయవాది చెప్పారు.
ఆర్టీసీ వ్యవహారం లేబర్ కోర్టుకు వెళ్లిపోయింది. అక్కడ కూడా వెంటనే కాదు, మరో రెండువారాల సమయం ఉంది. అంటే, సమ్మె సమస్యపై అంతవరకూ పరిష్కారం రాదు. ఈలోగా సమ్మె విరమించండీ అంటే కార్మికులు ఒప్పుకుంటారా..? ఒకవేళ లేబర్ కోర్టులో ఈ వ్యవహారం తేలకపోతే నేషనల్ ట్రిబ్యునల్ కి వెళ్లాల్సి ఉంటుంది. వ్యవహారంలో సాగదీతకే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కోర్టు తాజా ఆదేశాలపై కార్మికుల సంఘాలు ఇంకా స్పందించాల్సి ఉంది. సమ్మె ఆపాలంటూ కోర్టు చెప్పడంతో, దీనిపై సంఘాలు చర్చించి నిర్ణయం ప్రకటిస్తాయని అంటున్నారు. లేబర్ కమిషన్లో అయితే ప్రభుత్వానికి అనుకూలమైన పరిస్థితి ఉంటుందనీ, అందుకే మొదట్నుంచీ ప్రభుత్వం ఈ వాదనలు వినిపించిందని ఆర్టీసీ నేతలు అంటున్నారు. ఏదైతేనేం, ప్రస్తుతానికి ప్రభుత్వానిదే పైచేయి అయిందని అనొచ్చు.