రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో, ఆ తరువాత ఎన్నికల ప్రచారాల్లో తెరాస ఇచ్చిన హామీల్లో ముఖ్యమైంది… నియామకాలు. రాష్ట్రం ఏర్పడితే బోలెడు ఉద్యోగాలు వచ్చేస్తాయి, ప్రభుత్వ శాఖల్లో చాలా ఖాళీలు ఏర్పడతాయి, రానున్నది కొలువుల జాతరే అన్నారు. యువత కూడా ఆశగా ఆ మాటలు నమ్మింది. కానీ, ఇప్పుడు వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చాక కూడా నోటిఫికేషన్ల ఊసేలేదు. ప్రతీయేటా నోటిఫికేషన్ల కేలండర్ ముందుగానే ప్రకటిస్తామన్న హామీకి అతీగతీ లేదు. ఆ హామీలన్నీ వదిలేసి… ప్రభుత్వోద్యోగాలు కంటే ప్రైవేటు ఉద్యోగాలే మంచివి, ప్రైవేటులోనే జీతాలు బాగుంటాయంటూ యువతను మోటివేట్ చేస్తున్నారు మంత్రి హరీష్ రావు.
ఒక జాబ్ మేళాలో పాల్గొన్న హరీష్ రావు మాట్లాడుతూ… ఎంత కష్టపడ్డా ప్రభుత్వోద్యోగాల్లో అందరితో సమానంగానే పదోన్నతులుంటాయనీ, జీతాలు కూడా అలానే మెల్లగా పెరుగుతాయన్నారు. అదే ప్రైవేటులో అయితే ఎంత పని చేస్తే అంతే గుర్తింపు, అంతే సంపాదన అన్నారు. ప్రైవేటు కంపెనీల్లో చేరి సీయీవో స్థాయికి ఎదిగినవారు ఎంతోమంది ఉన్నారన్నారు. ఈ జాబ్ మేళాలో పేర్లను నమోదు చేసుకోవాలనీ, అవసరమనుకుంటే యువతకి శిక్షణ కూడా తామే ఇస్తామన్నారు. ప్రైవేటు ఉద్యోగంలో చేరేందుకు కొందరు సంశయిస్తున్నారనీ, కానీ చేరక తప్పదనీ, ఆ తరువాత ఏదైనా లక్ష్యం నిర్దేశించుకుని ప్రయత్నాలు చేసుకోవాలని హరీష్ రావు చెప్పారు.
చిన్నదా పెద్దదా అనే సంబంధం లేదు… ఇప్పటికీ ప్రభుత్వోద్యోగంపై యువతలో మంచి క్రేజే ఉంది. పంచాయతీ సెక్రటరీ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు కూడా పీజీలు చేసినవారు పోటీపడటం మర్చిపోయారా? ప్రైవేటురంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువ అనేది వాస్తవమే. అంతమాత్రాన, ప్రభుత్వోద్యోగాన్ని చిన్నగా పోల్చి చూపాల్సిన పనేముంది..? కష్టపడ్డా ఎదుగుదల ఉండదని చెప్తే ఎలా..? ఇలా మాట్లాడితేనే గతంలో ఇచ్చిన హామీలు అందరికీ గుర్తొస్తాయి. ప్రభుత్వం నుంచి తెలంగాణ యువత ఆశిస్తున్నది ప్రైవేటు ఉద్యోగాలు కాదు. టీఎస్పీఎస్సీ కేలండర్ ప్రతీయేటా ముందే ప్రకటిస్తామన్నారు, ఆ హామీ ఏమైందో ఎవ్వరికీ తెలీదు. ప్రతీయేటా గ్రూప్స్ నోటిఫికేషన్లన్నారు, అవేమయ్యాయో తెలీదు! అన్ని ప్రభుత్వ శాఖల్లో ప్రతీయేటా అవుతున్న ఖాళీల భర్తీ ఎప్పుడో చెప్పరు. ఆ మధ్య పెద్ద సంఖ్యలో కానిస్టేబుళ్ల నియామకం తప్ప, ప్రభుత్వోద్యోగాల భర్తీకి సంబంధించి కేసీఆర్ సర్కారు ఆలోచన చేయడమే లేదు. ఖాళీల భర్తీ ఎప్పుడా అని యువత ఎదురుచూస్తుంటే… అబ్బే, ప్రభుత్వోద్యోగాలు ఏమంత బాగోవు అన్నట్టుగా మంత్రి హరీష్ మాట్లాడటం ఎంతవరకూ సరైంది..? ఎంత కష్టపడ్డా ఈ జాబ్స్ లో గుర్తింపు ఉండదనడం… ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్నవారికి నిరుత్సాహం కలిగించే వ్యాఖ్య అవుతుంది కదా!