నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు… జగన్మోహన్ రెడ్డి మాటలను లెక్కచేయడం లేదా..? మొన్నటి పార్లమెంటరీ పార్టీ భేటీలో జగన్ హెచ్చరించిన ఎంపీల్లో రఘురామకృష్ణంరాజు ఒకరా..? అంటే.. అవుననే సమాధానాన్ని రఘురామకృష్ణంరాజు తొలి రోజు పార్లమెంట్ సమావేశాల్లోనే… ఇన్‌డైరక్ట్‌గా చెప్పే ప్రయత్నం చేశారు. తెలుగు మీడియాన్ని జగన్మోహన్ రెడ్డి రద్దు చేశారు. దాన్ని వైసీపీ నేతలందరూ.. పార్టీ లైన్‌గా.. గట్టిగా సమర్థిస్తున్నారు. జగన్ కూడా…పార్టీ లైన్ ప్రకారమే.. మాట్లాడాలని స్పష్టం చేశారు. కానీ రఘురామకృష్ణంరాజు… తొలి రోజు.. తెలుగును కాపాడాలంటూ.. పార్లమెంట్లో గళమెత్తారు. మాతృభాషలో విద్యాబోధనకు ప్రాధాన్యతనీయాలని డిమాండ్ చేశారు. మాతృభాషా పరిరక్షణకు ఉద్దేశించిన రాజ్యాంగంలోని 350, 350ఎ అధికరణాల స్ఫూర్తి దెబ్బతినకుండా కేంద్రం గట్టి చర్యలు తీసుకోవాలని రఘురామరాజు కోరారు.
రఘురామకృష్ణంరాజు.. ఎంపీగా ఎన్నికైన తర్వాత … రెండు,మూడు సార్లు ప్రధానమంత్రిని కలిశారు. దానికి పార్టీ పర్మిషన్ తీసుకోలేదు. కేంద్రమంత్రులతో దగ్గరి సంబంధాలు ఏర్పర్చుకున్నారు. వారికి విందులకు ఆహ్వానిస్తున్నారు కూడా. ఈ సంబంధాలు.. అంతకంతకూ పెంచుకుపోతూండటంతో… ఆయనకు.. కొన్ని పదవులు కూడా వచ్చాయి. ఓ విభాగంలో పార్లమెంటరీ స్థాయీ సంఘం పదవి కూడా వచ్చింది. నిజానికి ఆయన పేరును వైసీపీ సిఫార్సు చేయలేదు. విజయసాయిరెడ్డి, మిధున్ రెడ్డిల పేర్లను మాత్రమే.. జగన్ సిఫార్సు చేశారు. వారిద్దరితో పాటు… రఘురామకృష్ణంరాజుకు కూడా పదవి ప్రకటించారు. దీంతో వైసీపీ వర్గాలు ఆశ్చర్యపోయాయి. బీజేపీకి ఆయన బాగా దగ్గరవడం వల్లే ఇలా జరిగిందని వైసీపీ నాయకత్వం ఓ అభిప్రాయానికి వచ్చింది.
అయితే.. బీజేపీకి దగ్గరైనప్పటికీ… జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వారిపై ఎలాంటి చర్యలు తీసుకునే పరిస్థితిలో లేరు. దీంతో… వ్యాపార పనులు ఉన్న పనులు ఎంపీలు కూడా.. లాబీయింగ్ కోసం.. కేంద్రమంత్రుల్ని కలుస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ అంశంలో.. రఘురామకృష్ణంరాజుకు ఇంకా ఎక్కువ అవసరం. అందుకే ఆయన.. జగన్మోహన్ రెడ్డి కన్నా.. బీజేపీ విధానాలకే ఎక్కువ కట్టుబడి ఉంటున్నారంటున్నారు. మొత్తానికి.. రఘురామకృష్ణంరాజు.. వైసీపీలో ఓ రకమైన అలజడి మాత్రం రేపుతున్నారు.