తాను క్రిస్టియన్ని బహిరంగంగా ప్రకటించుకున్న గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి .. రిజర్వుడు నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి అర్హురాలో కాదో తేల్చాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు.. గుంటూరు జిల్లా అధికారులకు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాలు జారీ చేసింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. దీంతో.. గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ ఎమ్మెల్యేకు నోటీసులు జారీ చేశారు. కుల ధ్రువీకరణ పత్రాలతో రావాలని ఆదేశించారు. వినాయక చవితి ఉత్సవాల్లో .. తన నియోజకవర్గంలోని ఓ గ్రామానికి వెళ్లిన ఎమ్మెల్యే.. అక్కడ స్థానికులతో ఏర్పడిన వివాదంతో.. కులపరమైన ఆరోపణలు చేశారు. అదే సమయంలో.. తాను క్రిస్టియన్ మతం తీసుకున్నానని మీడియా సంస్థలకు స్వయంగా చెప్పారు.
చట్టం ప్రకారం.. మతం మార్చుకున్న వారికి.. రిజర్వేషన్లు వర్తించవు. దీంతో.. లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం రాష్ట్రపతికి, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. రాష్ట్రపతి కూడా.. కొద్ది రోజుల కిందట… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. ఉండవల్లి శ్రీదేవి కుల వివాదంపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలన్నారు. అయితే.. సీఎస్ పూర్తి స్థాయిలో విచారణ జరపకుండానే.. ఆయనను.. జగన్మోహన్ రెడ్డి అర్థాంతరంగా.. తొలగించారు. ఇప్పుడు.. కొత్త సీఎస్‌గా నీలం సహానీ వచ్చారు. ఈ లోపు.. ఎన్నికల సంఘం కూడా.. విచారణ జరుపుతోంది.
ఎమ్మెల్యే రిజర్వుడు సామాజికవర్గానికి చెందిన వారైనప్పటికీ.. మతం మార్చుకున్నారు. అలాగే.. కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఏ ప్రకారం చూసినా.. ఆమె రిజర్వుడు నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి అనర్హులు. తాడికొండ ఎస్సీ రిజర్వుడు. మతం మార్చుకుని..నిఖార్సైన ఎస్సీల అవకాశాలను గండికొడుతున్నారన్న విమర్శలు కొద్ది రోజులుగా ఎక్కువగా వినిపిస్తున్నాయి. అధికారులు నిజాయితీగా నివేదిక ఇస్తేనే.. అసలైన ఎస్సీలకు న్యాయం జరుగుతుందని.. లేకపోతే… చట్టం.. నిబంధనలకు పేపర్లకే పరిమితమవుతాయని.. దళిత సంఘాల నేతలు వాదిస్తున్నారు. మరి అధికారులు శ్రీదేవి వివరణ తీసుకుని ఆమె నిఖార్సైన ఎస్సీ అని .. రిపోర్టు ఇస్తారో.. మతం మార్చుకున్న విషయాన్ని చెబుతారో.. వేచి చూడాలి..!