తెరాస నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన వర్గనేతలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఉన్నట్టుండి ఈ సమావేశం ఎందుకయ్యా అంటే… తెరాస పార్టీని బలోపేతం చేసుకోవడానికీ, ఖమ్మం జిల్లాలో పార్టీని మరింత సమర్థంగా తయారు చేయడానికి అని తుమ్మల వర్గీయులు చెబుతున్నారు. కానీ, అసలు కారణం ఏంటంటే… తుమ్మల వర్గీయులు ఈ మధ్య అసంతృప్తిగా ఉండటమే. నిజానికి మూడు రోజుల కిందటే ఈ వర్గం నేతలు తొలిదఫా సమావేశం నిర్వహించారు. పార్టీకి సంబంధించిన పదవుల విషయంలో తమకు అన్యాయం జరుగుతోందంటున్నారు. ఇకపై మేమే అభివృద్ధి పనులు చూసుకుంటామనీ, తామే కమిటీలను వేసుకుంటామంటూ తుమ్మల వర్గం తాజాగా ఓ తీర్మానం చేసుకోవడం విశేషం. దీన్ని పార్టీ అధినాయకత్వానికి పంపిస్తామంటున్నారు.
ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికీ, తుమ్మల నాగేశ్వరరావుకీ ఈ మధ్య అస్సలు పడటం లేదన్నది తెలిసిందే. కందాల తెరాసలో చేరిన దగ్గర్నుంచీ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినవారికే స్థానికంగా ప్రాధాన్యత ఇస్తున్నారనీ, నిజమైన తెరాస నాయకుల్నీ ముఖ్యంగా తుమ్మల అనుచరుల్ని ఆయన పక్కనపెడుతున్నారట! ఇది ఆ వర్గానికి మింగుడుపడటం లేదు. అంతేకాదు, ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా ఆ వర్గాన్ని కందాల కలుపుకుని పోవడం లేదట. అయితే, దీన్ని ఒక ఫిర్యాదులా కాకుండా… ఉల్టా చేసి, తుమ్మల నాగేశ్వరరావు నాయకత్వంలో అందరూ నడవాల్సి ఉందనే అభిప్రాయాన్ని ఆ వర్గ నేతలు మీడియా ముందు చెబుతున్నారు. పాలేరు నియోజక వర్గానికి తుమ్మల చాలా అభివృద్ధి చేశారనీ, ప్రజలు ఇప్పటికీ దాన్ని గుర్తుపెట్టుకుంటున్నారనీ, కాబట్టి తుమ్మల సహాకారంతో ఎమ్మెల్యే కందాలను కూడా కలుపుకుని పోయి పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలన్నదే తమ లక్ష్యం అంటున్నారు.
గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తుమ్మలపై కందాల గెలిచిన సంగతీ తెలిసిందే. ఆ తరువాత, కాంగ్రెస్ నుంచి ఆయన తెరాసలోకి వచ్చి చేరారు. దీంతో, సహజంగానే వర్గపోరు మొదలౌతుంది. గెలిచిన ఎమ్మెల్యేగా కందాలకు ప్రాధాన్యత ఉంటుంది. ఆయనకి ప్రోటోకాల్ ఉంటుంది. ఇదే అవకాశంగా తన పట్టు పెంచుకోవడం కోసం కందాల ప్రయత్నిస్తారు కదా. ఇప్పుడు జరుగుతున్నదీ అదే. దీంతో, తుమ్మలను పక్కనపెడుతున్నారనే అభిప్రాయం కలుగుతోంది. ఈ అసంతృప్తిని తుమ్మల ఈవిధంగా వెళ్లగక్కుతున్నట్టు! మరి, తుమ్మల వర్గం భేటీపై పార్టీ అధినాయకత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. వలసల ప్రోత్సాహం సైడ్ ఎఫెక్ట్ గా ఈ మొత్తం వ్యవహారాన్ని చూడొచ్చు. ఓడిన ఎమ్మెల్యే అభ్యర్థీ, గెలిచిన ఎమ్మెల్యే… ఇద్దరూ ఒకేపార్టీలో ఉంటే ఏమౌతుంది… వర్గపోరు మొదలుకాక! ఇలాంటి పంచాయితీలు ఇంకా మున్ముందు చాలా ఉండే అవకాశాలున్నాయి.