మజ్లిస్ పార్టీ ఒకప్పుడు కేవలం హైదరాబాద్ కి మాత్రమే పరిమితం. కానీ, ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో కూడా పోటీ చేస్తోంది. మహారాష్ట్రలో రెండు అసెంబ్లీ, ఔరంగాబాద్ నుంచి పార్లమెంటు స్థానం గెలుచుకుంది. యూపీలో ఒక స్థానం దక్కించుకుంది. బీహార్ లో కూడా పోటీకి దిగింది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ లో పోటీకి ఆ పార్టీ సిద్ధమౌతోంది. ఈ నేపథ్యంలో మజ్లిస్ పార్టీపై సీఎం మమతా బెనర్జీ పెద్ద ఎత్తున విమర్శలు ప్రారంభించారు. హిందువుల్లో కొంతమంది తీవ్రవాదులు ఉన్నట్టే, ముస్లింలలో కూడా పుట్టుకొస్తున్నారన్నారు. భారతీయ జనతా పార్టీ నుంచి ఒక ముస్లిం పార్టీ భారీగా సొమ్ము తీసుకుందనీ, అది బెంగాల్ కి చెందిన పార్టీ కాదనీ హైదరాబాద్ కి చెందింది అంటూ మజ్లిస్ పార్టీని విమర్శించారు. సామాజిక వర్గాల మధ్య విభేదాలు సృష్టించేందుకు కుట్ర జరుగుతోందనీ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
మమతా వ్యాఖ్యలపై వెంటనే అసదుద్దీన్ కూడా స్పందించారు. బెంగాల్ లో భాజపాని ఎదుర్కోవడంలో మమతా పూర్తిగా విఫలమయ్యారనీ, దాంతో తమ మీద విమర్శలు చేస్తున్నారన్నారు. ఆ రాష్ట్రంలో కూడా ఎం.ఐ.ఎం.కి మంచి ఆదరణ ఉందనేది మమతా విమర్శల్లోనే తెలుస్తోందన్నారు. బెంగాల్ లో మజ్లిస్ ప్రాధాన్యత పెరుగుతోందనీ, తమ పని తాము చేసుకుంటూ పోతున్నామని ఒవైసీ చెప్పారు.
మజ్లిస్ పోటీ అనగానే మమతా ఇంత తీవ్రంగా ఎందుకు స్పందిస్తున్నట్టు..? నిజానికి, మజ్లిస్ ని భాజపా బి-టీమ్ అంటూ చాలా విమర్శలున్నాయి. ఎలా అంటే… ఇతర రాష్ట్రాల్లో మజ్లిస్ పోటీ చేయడం ద్వారా మైనారిటీ ఓట్లను కాంగ్రెస్ కి లేదా భాజపాయేతర పార్టీలకీ మళ్లకుండా, పరోక్షంగా భాజపాకి సాయం చేస్తోందనేది విమర్శ. బెంగాల్ విషయానికొస్తే… మమతా బెనర్జీకి ముస్లిం ఓటు బ్యాంకు బలమే ఎక్కువ. దీన్నే భాజపా ఇప్పుడు అక్కడ ప్రధాన ప్రచారాంశంగా మారుస్తోంది. ఇలాంటి సమయంలో ఎం.ఐ.ఎం. అక్కడ పోటీ చేస్తే… ముస్లిం ఓటు బ్యాంకులో చీలిక తెస్తే, మమతా గెలుపు అవకాశాలపై దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. బెంగాల్ లో మమతా ఓటమిని బలంగా కోరుకుంటున్న పార్టీ భాజపా. కాబట్టి, మజ్లిస్ రాక భాజపాకి ఉపయోగపడే వ్యూహంలో భాగమే అనేది కనిపిస్తూనే ఉంది. అయితే, ఇది భాజపా ప్రాయోజిత వ్యూహంగా విమర్శించేందుకు ఆధారాలూ ఎవ్వరి దగ్గరా లేవు! మొత్తానికి, మజ్లిస్ పోటీ అనేసరికి మమతా అప్రమత్తం అయిపోయారని అనొచ్చు!