తమిళనాడు లో సూపర్ స్టార్ లుగా ఒక వెలుగు వెలిగి, ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన రజనీకాంత్ మరియు కమల్ హాసన్ లు రెండేళ్లలో రానున్న అసెంబ్లీ ఎన్నికలలో కలిసి పోటీ చేయబోతున్నారా? కలిసి సినిమాలలో నటించిన వీరిద్దరు రాజకీయాల్లో కూడా చేతులు కలపనున్నారా? తమిళ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే చర్చ కొనసాగుతోంది… వివరాల్లోకి వెళితే..
రెండు రోజుల కిందట తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి మీద రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ వర్గాలకు మింగుడు పడలేదు. తాను ముఖ్యమంత్రిని అవుతానని స్వామి కలలో కూడా ఊహించి ఉండడు అని, అనుకోని రీతిలో ఆయన ముఖ్యమంత్రి కావడం అద్భుతం అంటూ వ్యంగ్యంగా రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు అన్నాడీఎంకే కార్యకర్తలకు కోపం తెప్పించాయి. అన్నా డీఎంకే కార్యకర్తలకు, రజిని ఫ్యాన్స్ కు మధ్య జరుగుతున్న యుద్ధం మీడియాలో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇదే సమయంలో ఈ టాపిక్ లోకి కమల్ హాసన్ జాయిన్ అయ్యారు. తన మిత్రుడు అయినటువంటి రజనీకాంత్ కు మద్దతుగా మాట్లాడుతూ, రజినీకాంత్ పళని స్వామిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వాస్తవమేనని అన్నారు. అయితే రజనీకాంత్ కు మద్దతుగా కమల్ హాసన్ మాట్లాడడంతో సహజంగానే మీడియా వీరిద్దరు రాజకీయాల్లో కలిసి పనిచేసే అవకాశం ఉందా అని ఆరా తీసింది.
కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం అన్న పార్టీని స్థాపించి ఇటీవల పార్లమెంటు ఎన్నికలలో పోటీ కూడా చేశారు. ఆ ఎన్నికలలో కమల్ హాసన్ పోటీ చేయక పోయినప్పటికీ, బరిలోకి దిగిన ఆయన పార్టీ అభ్యర్థులు చిత్తు చిత్తుగా ఓడిపోయారు. ఇక రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్లుగా ప్రకటించినైతే ప్రకటించారు కానీ తన పార్టీ పేరు గాని , తన పార్టీ విధి విధానాలు గానీ ప్రకటించలేదు. పైగా పార్లమెంటు ఎన్నికలకు ముందు కమల్ హాసన్ తమ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిందిగా రజినీకాంత్ ని కోరినప్పుడు, రజనీకాంత్ మౌనంగా ఉండిపోవడం తెలిసిందే. దీంతో రాజకీయాల్లో వీరిద్దరి దారులు వేరు వేరు అనే అభిప్రాయం తమిళ ప్రజల లో ఏర్పడింది. పైగా మొదటి నుండి కూడా రజనీకాంత్ బిజెపి కి, మోడీ కి అనుకూలంగా ఉన్నట్లుగా కనిపిస్తే, కమల్ హాసన్ తీరు మోడీ కి వ్యతిరేకంగా కమ్యూనిస్టు భావజాలానికి దగ్గర గా కనిపించడం కూడా రాజకీయాల్లో వీరివి వేరు దారులు అని ప్రజలు భావించడానికి కారణం అయ్యింది. అయితే రాజకీయాల్లో తమ ముద్ర వేయడానికి ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ కూడా ఉత్సుకతతో ఉన్నట్లుగా కనిపిస్తోంది. కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం పార్టీకి, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ అధికారంలోకి రావడానికి ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇక రజనీకాంత్ కూడా ఢిల్లీ పెద్దలతో సమావేశాలు అవుతున్నాడని, అంతర్గతంగా పార్టీకి సంబంధించిన వ్యవహారాలు మొదలుపెట్టేసుకున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే తమిళనాట బలంగా ఉన్నా ద్రవిడ పార్టీల మధ్య వీరిరువురు వేరు వేరుగా పోటీ చేసి ఏ మాత్రం ఫలితాలు సాధిస్తారు అన్న భావన ప్రజల్లో ఉంది.
అయితే ఇప్పుడు మాత్రం, రజనీకాంత్ కమల్ హాసన్ లు కలిసి పని చేయడానికి సిద్ధమే అన్నట్లుగా సంకేతాలిచ్చారు. తమది 44 సంవత్సరాల స్నేహమని, రాజకీయాలకు అతీతంగా తాను ఎప్పుడూ కలిసే ఉన్నామని అన్న కమల్ హాసన్, అవసరమైతే తమిళ ప్రజల కోసం రాజకీయంగా కూడా తామిద్దరం కలిసి పనిచేసే అవకాశం ఉంది అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల మీద రజినీకాంత్ కూడా స్పందించారు. పరిస్థితులు ఆ విధంగా అనుకూలిస్తే, కమల్ హాసన్ తో కలిసి పనిచేయడానికి తనకు అభ్యంతరం ఏమీ లేదని, ప్రజల కోసం తాము ఇద్దరం కలవడానికి సిద్ధమేనని వ్యాఖ్యానించారు.
మరి ఈ వ్యాఖ్యలు కేవలం వ్యాఖ్యలుగా మిగిలిపోతాయా లేక నిజమవుతాయా అనేది తెలియాలంటే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వరకు ఆగాల్సిందే!!