తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవికి కొత్తగా ఎవర్ని ఎంపిక చేస్తారనే చర్చ జరుగుతునే ఉంది. హైదరాబాద్ లో జరిగిన కాంగ్రెస్ శాసన సభాపక్షం సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. ఎవరికి పదవి ఇస్తే పార్టీకి మేలు జరుగుతుంది అనేది కాసేపు విశ్లేషించుకున్నారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కొండా విశ్వేశ్వరరెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం, మీడియాతో జగ్గారెడ్డి మాట్లాడారు. ఓ వారం కిందట, పీసీసీ పదవి తనకే ఇవ్వాలంటూ బయోడేటా తయారు చేసి హైకమాండ్ కి పంపిన జగ్గారెడ్డి… ఇప్పుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డికి మరోసారి అవకాశం ఇవ్వాలనీ, ఆయనకి ఇవ్వని పరిస్థితి ఉంటే తనకు పీసీసీ బాధ్యతలు అప్పగించాలని కోరుతున్నా అన్నారు!
అక్కడితో ఆగినా బాగుండేది. పీసీసీ అధ్యక్ష పదవిలో ఒక్కరినే పూర్తికాలం కొనసాగించకుండా, దశలవారీ అధ్యక్షుడిని మారుస్తూ పోవాలనే కొత్త ప్రతిపాదను ఆయన సూచించారు. ప్రస్తుతానికి శ్రీధర్ బాబుకి పీసీసీ పదవి ఇవ్వొచ్చన్నారు. కానీ, ఎన్నికల సమయం వచ్చేసరికి ఆయన్ని మార్చుతూ… రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎవరికైనా బాధ్యతలు ఇస్తే పార్టీకి మేలు జరుగుతుందన్నారు. ఎన్నికల సమయంలో, పదవి కోసం పోటీ పడుతున్న రెడ్డి సామాజిక వర్గ నేతలంతా ఒక సమావేశం పెట్టుకుని, ఒక నాయకుడి పేరును ఏకగ్రీవంగా ఖరారు చేయాలన్నారు! రెడ్డి సామాజిక వర్గం నాయకులందరూ పీసీసీ అధ్యక్ష పదవికి అర్హులే అని ఆయన వ్యాఖ్యానించారు.
పీసీసీ పదవిని ఒక సామాజిక వర్గానికి చెందిన అంతర్గత వ్యవహారంగా జగ్గారెడ్డి మాట్లాడారు. నిజానికి, ఇలాంటి వ్యాఖ్యలే కాంగ్రెస్ కి మరింత నష్టం కలిగించేవి. ఆ పార్టీలో బీసీల నుంచి సీనియర్ నేతలున్నారు, ఎస్సీ వర్గం నుంచి నాయకులున్నారు. ఇలా రెడ్లకి మాత్రమే అంటే వాళ్ల స్పందన ఎలా ఉంటుంది? ఇంకోటి, రెడ్లకు మాత్రమే పీసీసీ అంటున్నా… పార్టీలో ఉన్న రెడ్లకే ఐకమత్యం లేని పరిస్థితి. రేవంత్ రెడ్డికి బాధ్యతలు ఇస్తామంటే అడ్డుపుల్ల వేస్తున్నది ఈ రెడ్లే కదా! మొన్నటి హుజూర్ నగర్ ఉప ఎన్నిక దాకా కోమటిరెడ్డి సోదరులు వెర్సెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నట్టుగా పరిస్థితి ఉండేది. ఉత్తమ్ ని బహిరంగానే రాజగోపాల్ రెడ్డి విమర్శలు చేయడం చూశాం. వారిలో వారికే పడని పరిస్థితి. అయినా, ఇదేమన్నా మంత్రి పదవా కొన్నాళ్లు ఒకరికీ మరికొన్నాళ్లు మరొకరికీ అన్నట్టు మార్చుకోవడానికి! ఇలాంటి మాటలవల్ల పరిస్థితిని మరింత ఇబ్బందికరంగా తయారు చేసుకున్నట్టే అవుతుంది.