సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు ఇవాళ్ల మరో మెట్టు దిగారు. వివాదం హైకోర్టు పరిధి దాటి లేబర్ కోర్టుకు వెళ్లిపోవడంతో, సమ్మె విషయంలో కార్మిక సంఘాలు కూడా ఒక్కో అడుగూ వెనక్కి తగ్గుతూ వచ్చాయి. బుధవారం నాడు వివిధ కార్మిక సంఘాలు రోజంతా కార్మికులతో విడివిడిగా చర్చలు జరిపి… సమ్మె విరమణకు మానసికంగా వారిని సిద్ధం చేశాయి. జేయేసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ప్రశాంతమైన వాతావరణంలో తమకు ఎలాంటి షరతులూ పెట్టకుండా విధుల్లో చేరమంటూ పిలిస్తే వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఎలాంటి హామీ పత్రాలపైనా సంతకాలు పెట్టేది లేదనీ, కార్మికుల ఆత్మగౌరవం కాపాడే విధంగా చూడాలంటూ ప్రభుత్వాన్ని, ఆర్టీసీ యాజమాన్యాన్ని కోరారు. సమ్మె అంశమై తాము ప్రజల కోణం నుంచీ, ఆర్టీసీ ఉద్యోగుల కోణం నుంచి ఆలోచించి చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామనీ, కార్మికులను విధుల్లోకి ఆహ్వానిస్తే వెంటనే సమ్మె విరమణ చేస్తామని అశ్వత్థామరెడ్డి ప్రకటించారు.
కార్మికుల సమ్మె నిస్సహాయ స్థితికి చేరుకుని, ఇలాంటి ముగింపు దశకు వచ్చిందని చెప్పాలి. సమ్మె మొదలుపెట్టిన దగ్గర్నుంచీ కూడా ఉద్యోగ సంఘాల నుంచి మద్దతు లభించలేదు, ప్రజల నుంచి కూడా మద్దతు రాలేదు. చివరికి, రాజకీయ పార్టీలు కూడా కార్మికులకు అండగా ఉన్నట్టు వ్యవహరించినా… ఆయా పార్టీలకు సీఎం కేసీఆర్ తో ఉన్న రాజకీయ వ్యతిరేకతను ప్రదర్శించడానికే సమ్మెని వేదికగా వాడుకున్నాయే తప్ప, నూటికి నూరు శాతం కార్మికుల పక్షాన వారూ నిలిచింది లేదు. ప్రెస్ మీట్లు, ఉపన్యాసాలకు మాత్రమే ప్రతిపక్ష పార్టీల నేతలు పరిమితయ్యారు. ఏరకంగానూ ప్రభుత్వంపై ఒత్తిడి తేలేకపోయారు. దీంతోపాటు, కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు, జీతాల్లేని పరిస్థితి, ప్రభుత్వ వైఖరి కూడా వారి డిమాండ్లకు తలొగ్గే విధంగా ఎక్కడా కనిపించలేదు. చిట్ట చివరికి హైకోర్టు కూడా తమ పరిధులు దాటలేమనీ, ఇది లేబర్ కోర్టు వ్యవహారమంటూ తేల్చేసిన పరిస్థితి. దీంతో సమ్మె కొనసాగింపుపై కార్మికుల్లో కూడా నమ్మకం సడిలిపోయిందనే చెప్పాలి.
షరతుల్లేకుండా విధుల్లో చేరడానికి కార్మికులు సిద్ధం, కానీ ఇప్పుడు ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుందనేది చూడాలి. కేసీఆర్ సర్కారు దృష్టంతా యూనియన్లపై ఉంది. కాబట్టి, షరతుల్లేకుండా విధుల్లోకి తీసుకునే పరిస్థితి ఉంటుందా అనేది అనుమానం. యూనియన్లలో ఉండొద్దు, భవిష్యత్తులో సమ్మెలు చెయ్యొద్దు అనే షరతులు ప్రభుత్వం నుంచి ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇంకోటి… షరతుల్లేకుండా ఆహ్వానించాలని కార్మిక నాయకులు చెబితే ప్రభుత్వం వింటుందా అనేదీ ఓ ప్రశ్న ఉంది. ఎందుకంటే, వారి వల్లే సమ్మె జరిగిందనీ, ఆత్మహత్యలు జరిగాయని ప్రభుత్వం అంటూ వచ్చింది కదా. నెపమంతా వారిమీదే నెడుతూ వచ్చింద కదా! ఏదైతేనేం… సంఘాల నేతలు ఈ సమ్మెతో ఏం సాధించారనేది పక్కన పెట్టి, తక్షణం కార్మికులకు న్యాయం జరిగేలా చర్యలైతే ఉండాలి. కానీ, ఆ దిశగా ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందనేది వేచి చూడాల్సి ఉంది.