ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చెబితే అదే, ఎంత చెబితే అంతే, ఆయన మాట జవదాటరు, ఆయన నో అంటే నో, ఎస్ అంటే ఎస్… ఇలా ఉండేది అధికార పార్టీలో నాయకుల పరిస్థితి! కానీ, ఇప్పుడీ పరిస్థితిలో కొంత మార్పు కనిపిస్తోంది. జిల్లాల్లో మెల్లగా ఆధిపత్య పోరు తెరమీదికి వస్తోంది. గతవారంలో, ఖమ్మం జిల్లాకు చెందిన తమ్మల నాగేశ్వరరావు వర్గం ప్రత్యేకంగా సమావేశం కావడం, స్థానిక ఎమ్మెల్యేపై పార్టీ అధినాయకత్వానికి ఫిర్యాదు చేయడం తెలిసిందే. తుమ్మల మీద స్థానిక ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి కూడా ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఇప్పుడు అదే బాటలో ఇతర జిల్లాల్లోనే కూడా వర్గపోరు బయటపడుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరకి ఒక్కో పంచాయితీ చేరుతోంది.
మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సొంత పార్టీ నుంచే సహాయ నిరాకరణ ఎదురౌతోంది. తాండూరులో జరిగిన ఓ కార్యక్రమానికి మంత్రి వస్తే… మాజీ మంత్రి మహేందర్ రెడ్డి వర్గం గైర్హాజరైంది. ఆమె పర్యటనలో, గతంలో కాంగ్రెస్ నుంచి ఆమెతో వచ్చిన కేడర్ మాత్రమే సబిత వెంట ఉంటున్నారు. మొదట్నుంచీ తెరాసలో ఉంటున్నవారు ఆమె వెంట ఏ కార్యక్రమంలోనూ ఈ మధ్య కనిపించడం లేదు. గద్వాల జిల్లాలో మంత్రి నిరంజన్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి వర్గాలు రెండుగా చీలిపోయాయి. గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ మీద అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈయన వెనక మంత్రి నిరంజన్ రెడ్డి ఉన్నారనీ, ఆయన ద్వారానే స్థానిక వ్యవహారాల్లో అతిగా జోక్యం చేసుకుంటున్నారని ఆ వర్గం ఆరోపిస్తోంది. మంత్రి నిరంజన్ నిర్వహించే అధికార కార్యక్రమాలకు కృష్ణమోహన్ ఈ మధ్య ముఖం చాటేస్తున్నారు. కొల్లాపూర్ నియోజక వర్గంలో మాజీ మంత్రి జూపల్లి వర్గం అసంతృప్తిగా ఉంది. తమ వర్గాన్ని ఎమ్మెల్యే హర్షవర్థన్ చీల్చుతున్నారనేది జూపల్లి వర్గం ఆరోపణ.
జిల్లాలవారీగా చూసుకుంటే ఇలా ఆధిపత్య ఈ మధ్య తెరమీదికి వస్తోంది. ముఖ్యమంత్రికి ఇప్పటికే ఈ తరహా ఫిర్యాదులు చాలా వెళ్లాయని సమాచారం. ఈ ఆధిపత్య పోరులో కామన్ గా కనిపిస్తున్న అంశం ఏంటంటే…. ఫిరాయించిన ఎమ్మెల్యేకీ, స్థానికంగా ఎప్పట్నుంచో తెరాసలో ఉన్న నేతలకు మధ్య సయోధ్య కుదరకపోవడం. తెరాస వర్గం వేరు, తెరాసలోకి ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన నాయకులూ కార్యకర్తల వర్గం వేరు అన్నట్టుగా స్పష్టమైన విభజన వచ్చేసింది. ఇప్పుడు అందరూ కలిసి పని చేసుకోండని కేసీఆర్ సర్దిచెప్పే ప్రయత్నం చేసినా అంత సులువుగా సద్దుమణిగేవి కావివి. వరుసగా అందుతున్న ఈ ఫిర్యాదులపై ముఖ్యమంత్రి ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి.