ఈరోజుల్లో కథ కంటే హీరో క్యారెక్టరైజేషన్‌కే ఎక్కువ ప్రాముఖ్యత. ఆ పాత్ర ఎటిట్యూడ్ చుట్టూ సన్నివేశాలు నడిపేస్తే చాలు. అందులోనే వినోదం, అందులోంచే భావోద్వేగాలు పుట్టుకొస్తే చాలు. అందుకే దర్శకులంతా అటువంటి కథలకే పెద్ద పీట వేస్తున్నారు. హీరోలూ ఓకే చెప్పేస్తున్నారు. సాయిధరమ్ తేజ్ నటిస్తున్న `సోలో బతుకే సో బెటరూ..` కథ కూడా హీరో క్యారెక్టరైజేషన్ నుంచే పుట్టుకొచ్చింది.
టైటిల్‌ని బట్టి కథ ఎలాంటిదో అర్థం చేసుకోవొచ్చు. ఓ విధంగా ఇది `మన్మథుడు` స్టోరీనే. పెళ్లంటే పడని ఓ యువకుడి కథ. కాకపోతే… బలవంతంగా పెళ్లిళ్లు ఆపేస్తుంటాడు. ఎవరైనా తేజూని పెళ్లికి పిలిచారనుకోండి.. ఆ పెళ్లిని ఆపడమే.. ధ్యేయంగా పెళ్లికి వెళ్తుంటాడు హీరో. దాంతో తేజూని పెళ్లికి పిలవడానికి ఎవ్వరూ ధైర్యం చేయరు. అన్నట్టు.. సోలో బతుకే సో బెటరు ఎందుకో… హీరో ఓ పుస్తకం కూడా రాస్తాడట. అది.. హీరోయిన్ చదవడం, హీరో అడుగుజాడల్లోనే తానూ నడవడం – ఇది మరో ట్రాక్. ఈ లవ్ ట్రాక్‌లో, పెళ్లిళ్లు ఆపేయడంలో బోలెడంత వినోదం పండుతుంట. సినిమా అంతా ఇలానే తమాషా తమాషాగా ఉంటుందని తెలుస్తోంది. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి సుబ్బు దర్శకుడు. తనకు ఇదే తొలి సినిమా. ఇటీవలే పట్టాలెక్కింది.