లూలూ కంపెనీ కంటే… అద్భుతంగా.. అంత కంటే భారీగా… పెట్టుబడులు పెట్టగల కంపెనీలు ఏపీలో ఉన్నాయని.. అందుకే.. లూలూ కంపెనీని రాష్ట్రం నుంచి పంపేశామని… ఏపీ పరిశ్రమల మంత్రి గౌతంరెడ్డి గొప్పగా ప్రకటించారు. ఇంతకీ గౌతం రెడ్డి దృష్టిలో లూలూ కంటే పెద్ద కంపెనీ ఏమిటనుకున్నారు.. ఎమ్మెల్యే రోజా .. చైర్మన్ గా ఉన్న ఏపీఐఐసి. లూలూ కంపెనీని మించి ఏపీఐఐసీకి… విశాఖలో కన్వెన్షన్ హాల్ నిర్మించే సామర్థ్యం ఉందని గౌతం రెడ్డి ప్రకటించారు. సింగిల్ బిడ్ రావడం, భూమి ప్రైమ్ ఏరియాలో ఉండడంతో.. లులు కంపెనీ ప్రాజెక్ట్‌ను రద్దు చేశామని గౌతంరెడ్డి చెప్పుకున్నారు. ఏపీఐఐసీ వద్ద కూడా గొప్ప టెక్నాలజీ ఉందని..
గతంలో హైటెక్స్‌ని ఏపీఐఐసీనే నిర్మించిందని సర్టిఫికెట్ కూడా చూపించారు.
లూలూ గ్రూప్.. ప్రపంచంలోనే మాల్స్, కన్వెన్షన్ హాల్స్, హోటల్స్ రంగంలో ప్రసిద్ధి చెందిన కంపెనీ. గల్ఫ్‌లో పేరెన్నికగన్న మాల్స్ అన్నీ లూలూ కంపెనీ ఆధ్వర్యంలోనే ఉంటాయి. సహజంగా.. ఆ కంపెనీకి ఏపీపై ఎలాంటి ఆసక్తి లేదు. కానీ..అప్పట్లో కేంద్రమంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు చొరవతో.. చంద్రబాబు తీవ్రంగా కృషి చేసి.. విశాఖలో అంతర్జాతీయ స్థాయి మాల్.. కన్వెన్షన్ సెంటర్ నిర్మించేందుకు ఒప్పందం చేసుకున్నారు. శంకుస్థాపన కూడా చేశారు. ఈ ప్రాజెక్ట్ పై రూ.2200 కోట్లు పెట్టుబడి పెట్టాలని లూలూ గ్రూప్ అనుకుంది.
దీని కోసం డిజైన్లను కూడా ఖరారు చేసుకుంది. కానీ ప్రభుత్వం మారిన తర్వాత విశాఖకు అంతర్జాతీయ స్థాయి మాల్.. కన్వెన్షన్ సెంటర్ అవసరం లేదనుకున్నారేమో కానీ.. ఏకపక్షంగా ఒప్పందాన్ని రద్దు చేశారు. దీంతో ఆ కంపెనీ ఏపీలో ఇక ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టబోమని ప్రకటించేసింది. దీనిపై వివరణ ఇచ్చిన గౌతంరెడ్డి.. రోజా ఆధ్వర్యంలోని ఏపీఐఐసీనే రూ. 2200 కోట్లతో మాల్ కడుతుందన్నట్లుగా ప్రకటన చేశారు. ఆరు నెలల్లో ఒక్క పరిశ్రమనూ ఏపీకి తీసుకు రాలేకపోయినా.. ఇలాంటి కంపెనీలను తరిమేయడంలో మాత్రం.. ఏపీ సర్కార్ చురుగ్గా వ్యవహరించింది.