ఎన్నికలకు ముందు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని.. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం.. ప్రైవేటు కంపెనీలకు ఇచ్చిందంటూ.. చేసిన ప్రచారం… పెట్టిన కేసులు అన్నీ కరెక్ట్ కాదని.. కేంద్ర ప్రభుత్వం తేల్చేసింది. ఈ మేరకు.. పార్లమెంట్‌లోనే.. కేంద్రమంత్రి సంజయ్ థాత్రే స్పష్టమైన సమాచారం ఇచ్చారు. ఆధార్ డేటాను ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వలేదని.. డేటా చోరీ ఉత్పన్నమయ్యే సమస్యే లేదని కేంద్రమంత్రి తేల్చి చెప్పారు. ఈ అంశంపై.. రాజ్యసభ సభ్యుడు కేవీపీ.. కేంద్రాన్ని ఓ ప్రశ్న అడిగారు. ఐటీ గ్రిడ్ ద్వారా ఆధార్‌డేటాను టీడీపీ చోరీ చేసిందని .. గతంలో ఆరోపణలు వచ్చాయని.. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీనే హడావుడి చేసిందని.. గుర్తు చేశారు. ఇప్పుడా కేసు పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.
తెలుగుదేశం పార్టీకి యాప్ సేవలు అందిస్తున్న ఐటీ గ్రిడ్ అనే కంపెనీ… విజిల్ బ్లోయర్ గా చెప్పుకుంటున్న లోకేశ్వర్ రెడ్డి అన్ వ్యక్తి ఫిర్యాదు మేరకు తెలంగాణ ప్రభుత్వం హడావుడి చేసింది. కేసులు నమోదు చేసి.. పోలీసులు హంగామా సృష్టించారు. టీడీపీ యాప్ సమాచారాన్ని మొత్తం వారు తీసుకెళ్లారని టీడీపీ ఆరోపించింది. ఈ విషయంలో… ఆధార్ చోరీ జరిగే ప్రశ్నే లేదని కేంద్రం తేల్చి చెప్పింది. ఓటర్ వివరాలు ట్యాంపరింగ్ చేయడం కూడా సాధ్యం కాదని… ఈసీ చెప్పింది. ఈ క్రమంలో.. కేవలం రాజకీయ దురుద్దేశాలతోనే కేసు నమోదు చేసి… పోలీసులు పొలిటికల్ గేమ్ ఆడారన్న ఆరోపణలకు కేంద్ర ప్రభుత్వ సమాధానంతో… బలం చేకూరినట్లయింది. ఎన్నికలకు ముందు.. ఎన్నికల సమయంలో.. ఐటీ గ్రిడ్ కేసు కూడా.. ప్రచారాస్త్రం అయింది.
టీడీపీ ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీ చేసిందని.. జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. కొసమెరుపేమిటంటే.. ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా… డేటా చోరీ అంటూ ఆరోపణలు చేసి వెళ్లారు. తీరా.. అలాంటి చోరీ ఏమీ ఉండదని.. అసాధ్యమని.. కేంద్రం చెప్పడంతో…అప్పట్లో టీడీపీపై రాజకీయ కుట్ర జరిగిందా.. అన్న కోణం వైపు.. విషయం మళ్లుతోంది.