విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతలిస్తామన్న హామీతో.. వైసీపీలో చేరిన దేవినేని అవినాష్‌కు.. వెంటనే.. తీపికబురు అందింది. ఆయనను.. తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జ్‌గా వైసీపీ ప్రకటించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించుకుని.. దేవినేని అవినాష్ ఆనందం వ్యక్తం చేశారు. తన శాయశక్తులా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పుకొచ్చారు. నిజానికి తూర్పు నియోజకవర్గం నుంచి.. గతంలో.. వంగవీటి రాధా వైసీపీ తరపున పోటీ చేశారు. 2014ఎన్నికల్లో దేవినేని నెహ్రూ, అవినాష్.. ఇద్దరూ కాంగ్రెస్‌లోనే ఉన్నారు. నెహ్రూ.. సెంట్రల్ నియోజకవర్గం నుండి.. అవినాష్ పార్లమెంట్‌కు పోటీ చేసి ఓడిపోయారు. ఆ సమయంలో వంగవీటి రాధా వైసీపీలో విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసి.. టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ చేతిలో పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత వైసీపీకి దూరమయ్యారు.
2014 ఎన్నికల తర్వాత వంగవీటి రాధాను పక్కన పెట్టిన జగన్.. యలమంచిలి రవి అనే మాజీ ఎమ్మెల్యేను.. టీడీపీ నుంచి తీసుకుని ఇన్చార్జ్ పదవి ఇచ్చారు. చివరికి ఆయనకు టిక్కెట్ ఇవ్వకుండా.. కార్పొరేటర్ గా ఉన్న బొప్పన భవకుమార్ అనే నేతకు టిక్కెట్ ఇచ్చారు. వీరిద్దరూ.. నియోజకవర్గంలో తమదైన అనుచరగణంతో రాజకీయాలు చేసుకున్నారు. అయితే.. గద్దె రామ్మోహన్ మరోసారి విజయం సాధించారు. అప్పట్నుంచి.. ఈ నియోజకవర్గంలో.. టీడీపీ నుంచి బలమైన నేతను తీసుకొచ్చి పెట్టాలనుకున్న జగన్.. దేవినేని అవినాష్ పై కన్నేశారు. టీడీపీలో బలమైన నేతలు ఉండటంతో.. అవినాష్‌కు నగరంలో టిక్కెట్ దక్కడం కష్టంగా మారింది. తూర్పు నియోజకవర్గం ఆశ చూపడంతో.. ఆయన సులువుగా జగన్ పార్టీకి ఆకర్షితులయ్యారు.
అయితే దేవినేని అవినాష్‌కు.. తూర్పు నియోజకవర్గంలో అంత సులువు కాదు. అక్కడ బొప్పన భవన కుమార్, యలమంచిలి రవిలతో సరిపడే అవకాశం లేదు. వారిని కలుపుకుని వెళ్లే పరిస్థితి లేదు. వారు ఇప్పటికి సర్దుకుపోయినా.. భవిష్యత్ లో గందరగోళం సృష్టిస్తారు. అందుకే.. వైసీపీ వ్యూహాత్మకంగా… అవినాష్‌ను.. అధికారికంగా ఇన్చార్జ్ గా ప్రకటించలేదంటున్నారు. అవినాష్ తనకు తానే ప్రకటించుకునేలా ప్రోత్సహించారు. శ్రేణుల్లో వ్యతిరేకత వస్తే.. ఇంకా నిర్ణయించలేదని.. చెప్పడానికే ఇలా వైసీపీ నేతలు చేస్తూంటారని.. ఆ పార్టీలో ఉన్న వారి అభిప్రాయం.