ఆంధ్రప్రదేశ్ అప్పులు మరోసారి హాట్ టాపిక్ అవుతున్నాయి. ఆరు నెలల తర్వాత ఏపీ సర్కార్.. చంద్రబాబు హయాంలో భారీగా అప్పులంటూ..బలమైన వాదన వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థిక పరిస్థితిని చూపిస్తూ.. గతంలో చంద్రబాబు సర్కార్ చేసిన అప్పుల్ని బూతద్దంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏపీ సర్కార్ అప్పులతో పాటు… ఆస్తులు కూడా అమ్మేసే ప్రయత్నం చేస్తోంది. దీన్ని బుగ్గన సమర్థించుకుంటున్నారు. అయినా గతంలో ఇచ్చిన అప్పులపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. బుగ్గన ఇలా .. ఎందుకు ఇప్పుడు హడావుడి చేస్తున్నారో చాలా మందికి అర్థం కావడం లేదు. కానీ.. రెండు, మూడు నెలల్లో.. ఏపీలో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించాల్సిన ఆగత్యం ఏర్పడుతుందన్న ప్రచారం జరుగుతోంది.
కొత్త ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఆదాయం పడిపోయింది. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు తగ్గిపోయాయి. రావాల్సిన నిధులను అడిగే పరిస్థితి లేదు. కానీ అమలు చేయాల్సిన పథకాలు మాత్రం.. పేరుకుపోతున్నాయి. మొట్టమొదటి హామీగా చెప్పుకున్న రైతు భరోసాకు ఇవ్వాల్సిన ఆరు వేల ఐదు వందల రూపాయలను కూడా.. మూడు విడతలుగా చేసి ఇవ్వాల్సి వచ్చింది. ఇక నెలకో పథకం ప్రారంభించాల్సి ఉంది. ఇక బిల్లుల చెల్లింపులు.. జీతాలు ఇతర ఖర్చులు ఉండనే ఉన్నాయి. వీటన్నింటినీ.. ప్రభుత్వం సర్దబాటు చేసుకోలేకపోతోంది. పూర్తిగా అప్పుల మీదనే ఆధారపడుతోంది. ఎంత వడ్డీ అని చూడకుండా… ఎంత అప్పు దొరికితే.. అంత తీసుకుంటోంది. అలా.. ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలల్లోనే.. పదహారు వేల కోట్ల వరకూ రుణం తీసుకుంది. బడ్జెట్లో.. తాము తీసుకోదలిచిన అప్పును 48 వేల కోట్ల వరకూ చూపించింది.
అయితే.. ఏపీ ఆర్థిక పరిస్థితి కారణంగా.. అప్పులు ఇచ్చేందుకు ఇతర ఆర్థిక సంస్థలు, బ్యాంకులు ఆసక్తి చూపించడం లేదు. ఈ కారణంగా.. పథకాల అమలుకు చిక్కులు ఎదురవుతున్నాయి. అయితే అసలు ఏ ప్రభుత్వమైన అప్పులను.. సంక్షేమం పేరుతో.. డబ్బులు పంచడానికి చేయదు. అభివృద్ధి కార్యక్రమాల కోసం చేస్తుంది. కానీ ఏపీ సర్కార్ మాత్రం భిన్నంగా వ్యవహరిస్తోంది. సంపద పెంచకుండా.. అప్పులు చేస్తూ పోతే.. భవిష్యత్ ఏమిటన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఈ పరిస్థితే.. ఏపీని ముంచబోతున్నాయంటున్నారు. జనవరిలో ప్రస్తుత సర్కార్ ముందు అతి పెద్ద ఆర్థిక గండం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఆ నెలలో కనీసం పది వేలకోట్లను అదనంగా పధకాల కోసం..కేటాయించాల్సి ఉంది. చేతులెత్తేయాల్సిన పరిస్థితి వస్తే.. గత ప్రభుత్వం వల్లేనని చెప్పుకోవచ్చన్న ఉద్దేశంతో ఇప్పటి నుంచే విమర్శలు చేస్తున్నారనే అంచనాలు వినిపిస్తున్నాయి.