తెలుగు360 రేటింగ్ : 2.75 / 5
థ్రిల్లర్ సినిమాలకున్న క్రేజ్ వేరు. పెద్ద స్టార్లు అవసరం లేదు. డాబులు అక్కర్లెద్దు. ఓ చిన్న కథ… దానికి మలుపులు తోడైతే చాలు. బడ్జెట్ కూడా పరిధిలోనే ఉంటుంది కాబట్టి, పాసైపోవొచ్చు. కాకపోతే… ఇలాంటి సినిమాలకు సక్సెస్ రేటు తక్కువ. కొండోకచో… హిట్లవుతుంటాయి. లెక్కలు తేడా వేస్తే, మలుపులు ముందే ఊహించేస్తే మొదటికే మోసం వస్తుంది. ఈమధ్య వచ్చిన `ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ`, `ఎవరు` మంచి థ్రిల్లర్లుగా నిలిచాయి. ఈ స్ఫూర్తితో ఈ జోనర్‌కి మరింత బలం వచ్చింది. థ్రిల్లర్ సినిమాల సంఖ్య పెరిగింది. ఆ జాబితాలో వచ్చిన మరో సినిమా `రాగల 24 గంటల్లో`.
కథలోకి వెళ్దాం..
రాహుల్ (సత్యదేవ్) ప్రొఫెషనల్ యాడ్ ఫిల్మ్ మేకర్. కెమెరా తన మూడో కన్ను. ఎంత మంది మోడల్స్ తన వెంటపడినా… అస్సలు కరగడు. కానీ… విద్య (ఇషా రెబ్బా)ని చూసి మాత్రం మనసు పారేసుకుంటాడు. తొలి చూపులోనే `ఐ లవ్ యూ` చెప్పి, పెళ్లి ప్రపోజల్ తీసుకొస్తాడు. విద్య కూడా సరే అంటుంది. అయితే పెళ్లయ్యాక… రాహుల్ వింతగా ప్రవర్తిస్తుంటాడు. మెల్లమెల్లగా సైకో లక్షణాలూ కనిపిస్తుంటాయి. ఈ సైకోతనం విద్య భరించలేకపోతుంది. సడన్ గా ఓ రోజు గొడవ పెద్దదవుతుంది. విద్యని చంపేయాలనుకుంటాడు రాహుల్. కానీ తన నుంచి విద్య తప్పించుకుంటుంది. కానీ.. అనుకోని పరిస్థితుల్లో రాహుల్ చనిపోతాడు. ఇంతకీ రాహుల్ ఎలా చనిపోయాడు? తనని చంపింది ఎవరు? అనేది తెలియాలంటే… `రాగల 24 గంటల్లో` చూడాలి.
థ్రిల్లర్ చిత్రాలకు చిన్న లైన్ ఉంటే చాలు. మలుపులు మాత్రం ముఖ్యం. ఆ లైనూ, మలుపులూ… ఈ చిత్రానికి కావల్సినంత ఉన్నాయి. జైలు నుంచి ముగ్గురు ఖైదీలు పారిపోవడం దగ్గర్నుంచి కథ మొదలవుతుంది. సినిమా మొదలైన కాసేపటికే.. రాహుల్ మృతదేహం కనిపిస్తుంది. అక్కడి నుంచి రాహుల్ ఎలా చనిపోయాడు? అనే ఆసక్తి మొదలవుతుంది. కథ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తుంది. అక్కడ కొంత సేపు బోర్ కొట్టినా – రాహుల్‌లోని మరో మనిషి బయటకు రావడంతో – మళ్లీ కథనం పరుగందుకుంటుంది. విద్యని రక్షించడానికి ముగ్గురు ఖైదీలు సహాయం చేయడం కాస్త విడ్డూరంగా అనిపించినా – దానికీ కథకీ కాస్త లింకు ఉండడంతో – సర్దుకుపోవొచ్చు. సాధారణంగా ఇలాంటి కథలు సెకండాఫ్‌లో గతి తప్పుతుంటాయి. కానీ ద్వితీయార్థంలో కూడా కొన్ని మలుపుల్ని అట్టిపెట్టుకోగలిగాడు దర్శకుడు. ఐదారు సన్నివేశాలకు ఓసారి కథ కొత్త దారిని వెదుక్కుంటూ ముందుకు వెళ్తుంటుంటుంది. అక్కడక్కడ స్లో నేరేషన్ ఇబ్బంది పెట్టే అంశమే. ఇలాంటి సినిమాల్ని ఎంత ట్రిమ్ చేసుకుంటే అంత మంచిది. ఖైదీల ఫ్లాష్ బ్యాక్ వీలైనంత తగ్గించుకుంటే బాగుండేది.
సత్యదేవ్ సైకో సన్నివేశాలు, అతని ప్రవర్తనలో సడన్‌గా వచ్చి పడిపోయే మార్పులు ఈ కథని నడిపిస్తూ ఉంటాయి. మధ్యమధ్యలో కృష్ణభగవాన్ నేనూ ఉన్నానంటూ కాలింగ్ బెల్ కొట్టి కథలోకి ప్రవేశిస్తాడు. ఆ ఎపిసోడ్లు డిస్ట్రబ్ కలిగించేవే. మామూలుగా అయితే… ఇలాంటి మర్డర్ మిస్టరీలో అతి వినయంగా ఉన్నవాళ్లూ, అత్యంత ఓవరాక్షన్ చేసేవాళ్లూ చివరికి దోషులుగా నిరూపితం అవుతుంటారు. ఈ థీరీ తెలిసిన వాళ్లు హంతకుడు ఎవరన్నది ముందే కనిపెట్టేస్తారు. కాకపోతే… కాస్త సస్పెన్స్ కొనసాగిస్తూ, ప్రేక్షకుల్ని చివరి వరకూ కూర్చోబెట్టడంలో మాత్రం ఈ సినిమా విజయవంతమైందనే చెప్పాలి.
సత్యదేవ్ పాత్రలో విలన్ ఛాయలు కనిపించినా తనే ఈ సినిమాకి హీరో. తన నటనతో ఆకట్టుకున్నాడు. హీరోగా కొనసాగుతూ ఇలాంటి పాత్రలు ఎంచుకోవడం నిజంగా ఓ సాహసమే. అనుష్క, కాజల్ చేయాల్సిన పాత్ర ఇషాకి ఇచ్చాం అన్నారు గానీ, నిజానికి అంత లేదిక్కడ. కాకపోతే.. తన వరకూ బాగా చేసింది. అనుష్క, కాజల్‌లు వస్తే… కథలు వాళ్లని బట్టి మారిపోయేవేమో..? చాలా రోజుల తరవాత శ్రీరామ్ మళ్లీ తెలుగు తెరపై కనిపించాడు. పోలీస్ అధికారిగా తన నటన బాగుంది. కృష్ణ భగవాన్ కదల్లేకపోతున్నాడు. తను కనిపించేది రెండు సీన్లే. కానీ విసిగించేశాడు. ముగ్గురు ఖైదీలతో పాటు, మిగిలిన పాత్రధారులూ తమ ఎంపిక తప్పుకాదని నిరూపించుకున్నారు.
శ్రీనివాసరెడ్డి ఇప్పటి వరకూ కామెడీ సినిమాలే తీశారు. తొలిసారి ఆయన ఎంచుకున్న థ్రిల్లర్ ఇది. అయితే ఎక్కడా తడబడకుండా సినిమాని తెరకెక్కించగలిగాడు. ఎక్కడకక్కడ మలుపులు ఉండేలా చూసుకోవడం కలిసొచ్చింది. రఘుకుంచె నేపథ్య సంగీతం కూడా ఓకే అనిపిస్తుంది. సినిమా లుక్ రిచ్‌గా ఉంది. కృష్ణభగవాన్ సంభాషణల్లో ఛమక్కులు తక్కువే. అయినా ఇలాంటి సినిమాల్లో మాటల గారడీని ఊహించలేం.
మొత్తానికి థ్రిల్లర్లు ఇష్టపడేవాళ్లకు ఈవారం ఇది మంచి ఛాయిసే. కాకపోతే మరీ ఎక్కువగా ఊహించుకుని వెళ్లకూడదు. టైమ్ పాస్ కోరుకుంటే మాత్రం టికెట్టు డబ్బులు గిట్టుబాటు అయిపోతాయి.
ఫినిషింగ్ టచ్: 2 గంటలూ.. ఎన్నో మలుపులు
తెలుగు360 రేటింగ్ : 2.75 / 5