సుజనా చౌదరిపై.. వైసీపీ నేతలు మూకుమ్మడి దాడి చేస్తున్నారు. గురువారం మీడియా సమావేశంలో వైసీపీ ఎంపీలు చాలా మంది టచ్‌లో ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇది వైసీపీకి సూటిగా తగిలింది. ఢిల్లీలోనే వైసీపీ ఎంపీలు ప్రెస్ మీట్ పెట్టి.. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బీజేపీతో టచ్‌లో ఉన్న వైసీపీ ఎంపీలెవరో చెప్పాలని డిమాండ్ చేశారు. చివరి శ్వాస విడిచే వరకు వైసీపీలోనే ఉంటామన్నారు. తాము ఎన్నికల్లో రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా గెలిచామని.. సుజనా చౌదరిలా బ్యాంకులు కన్నం వేయలేదన్నారు. బ్యాంకులకు వందల కోట్లు ఎగ్గొట్టి… కేసుల మాఫీ కోసమే.. సుజనా చౌదరి బీజేపీలో చేరారని మండిపడ్డారు.
అయితే వైసీపీ ఎంపీలు సుజనా చౌదరిని విమర్శించడంలో… ఓ కచ్చితమైన లైన్ పాటించారు. బీజేపీని వారు పల్లెత్తు మాట అనలేదు. సుజనా చౌదరిని వ్యక్తిగతంగా విమర్శించాలి.. బీజేపీపైకి మాట పోకూడదని స్పష్టమైన ఆదేశాలు రావడంతో.. ఎంపీలు దాన్ని జవదాటలేదు. మామూలుగా విమర్శించలేరు కాబట్టి… సుజనా చౌదరికి టీడీపీకి లింక్ పెట్టేశారు. వైసీపీ తలుపులు తెరిస్తే టీడీపీ ఎమ్మెల్యేలంతా చేరిపోతారు.. ఏపీలో టీడీపీ బతికే పరిస్థితి లేదని ఎంపీలు చెప్పుకొచ్చారు. సుజనా బీజేపీలో ఉంటూ టీడీపీ ఏజెంట్లా మాట్లాడుతున్నారని.. సుజనా చౌదరి ఎవరు అంటే బ్యాంక్ దొంగ అంటారని ఎంపీలు మండిపడ్డారు. వైసీపీ ఎంపీలంతా జగన్ విధేయులేనని.. లేనిపోని ప్రచారంతో గందరగోళం సృష్టించవద్దని.. సుజనాకు ఎంపీలు సూచించారు.
విజయసాయిరెడ్డి కూడా ట్విట్టర్లో టీడీపీకి, సుజనాకు లింక్ పెట్టి మాట్లాడారు. సుజనా అరడజను బ్యాంక్‌ల అధికారులతో ప్రెస్‌మీట్ పెట్టాలని.. వాళ్ల ప్రశ్నలకు సమాధానం చెబితే.. ఆయన పార్టీ ఎందుకు మారాడో, బాబు ఎందుకు మార్చాడో.. అన్నీ అర్థమవుతాయన్నారు. సుజన ప్రెస్‌మీట్ చూస్తుంటే బీజేపీ వేరు.. బాబు జనాల పార్టీ వేరని అర్థమైందన్నారు. ఎంపీలు కాకుండా మంత్రులు కూడా… సుజనాచౌదరిపై మండిపడ్డారు. సుజనాచౌదరి కాల్ డేటా బయటపెడితే గుట్టు రట్టవుతుందన్నారు. వైసీపీ నేతలు టచ్‌లో ఉన్నారంటున్న సుజనాచౌదరి.. బీజేపీలో చేరినా టీడీపీతో ఇంకా టచ్‌లో ఎందుకు ఉన్నారని పేర్ని నాని ప్రశ్నించారు.