నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజును జగన్మోహన్ రెడ్డి హటాహుటిన ఢిల్లీ నుంచి అమరావతి పిలిపించారు… సీఎం జగన్మోహన్ రెడ్డి. పార్లమెంట్ సమావేశం జరుగుతున్నప్పటికీ.. ఆయనను తీసుకుని విజయసాయిరెడ్డి, మిధున్ రెడ్డి… అమరావతి వచ్చారు. ముగ్గురూ జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. పార్టీ లైన్ కు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడవలసి వచ్చిందో.. జగన్మోహన్ రెడ్డి .. రఘురామకృష్ణంరాజు వద్ద వివరణ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ లైన్ కు తాను వ్యతిరేకంగా మాట్లాడలేదని.. రఘురామకృష్ణంరాజు జగన్ కు చెప్పినట్లుగా తెలుస్తోంది.
ప్రధానితో సన్నిహితంగా ఉంటే రాష్ట్రానికి సంబంధించిన అనేక సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి ఉపయోగపడుతుందని వివరణ ఇచ్చారు. తనకేమీ వ్యక్తిగత పనుల్లేవని, పైగా పార్టీ లైన్ కు విరుద్ధంగా తనెక్కడా వ్యవహారించలేదని వివరణ ఇచ్చినట్లు గా తెలుస్తోంది. ఈ మేరకు రఘురామకృష్ణంరాజు నుంచి లిఖిత పూర్వక వివరణ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మొదటి రోజు.. పార్టీ లైన్ కు వ్యతిరేకంగా మాట్లాడటం.. రెండో రోజు.. మోడీనే.. నేరుగా వచ్చి పలకరించడం.. ఆ వెంటనే.. సుజనా చౌదరి.. వైసీపీ ఎంపీలు తమతో టచ్‌లో ఉన్నారని ప్రకటించారు.
దీంతో సహజంగానే.. వైసీపీలో గగ్గోలు రేగింది. ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలిస్తే.. పరిస్థితి సీరియస్ అవుతుందని గ్రహించి.. మిగతా ఎంపీలకు హెచ్చరికలా ఉండాలన్న ఉద్దేశంతో.. రఘురామకృష్ణంరాజును పిలిపించినట్లుగా తెలుస్తోంది. వైసీపీలో ఇంకెవరూ క్రమశిక్షణ దాటడానికి అవకాశం లేదని.. స్పష్టమైన హెచ్చరికలు పంపారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలైనా.. సరే.. తాము చెప్పిన తర్వాతే మాట్లాడాలని.. ఎంపీలకు సూచనలు వెళ్లాయి.