అనుకున్నంతా అయింది. శరణార్థులకు సరిహద్దులు బార్లా తెరవడం ప్రమాదకరమనే హెచ్చరికలే నిజమయ్యాయి. సిరియా శరణార్థుల రూపంలో ఐసిస్ ఉగ్రవాదులు పెద్ద సంఖ్యలో యూరప్ లో ప్రవేశించారనే వార్తలు కలకలం రేపాయి. ముఖ్యంగా యూకే, జర్మనీల్లో పెద్ద సంఖ్యలో ముష్కరులు చొరబడ్డారట. జర్మనీ డొమెస్టిక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చీఫ్ స్వయంగా ఈ విషయం చెప్పారు. ఇప్పటికే జర్మనీలో దాడికి ఉగ్రవాదులు పన్నిన కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. నలుగురు ఉగ్రవాదులు సిరియా నుంచి శరణార్థుల రూపంలో జర్మనీలోకి వచ్చినట్టు రూఢి అయింది. వీరే కాకుండా ఇంకా చాలా మంది ప్రవేశించి ఉంటారని అనుమానిస్తున్నారు.
ఇక, యూకేకు పెనుముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. పారిస్ దాడుల సూత్రధారితో సహా పెద్ద సంఖ్యలో టెర్రరిస్టులు ఇంగ్లండ్ లో ఇప్పటికే ప్రవేశించారని వార్తలు వచ్చాయి. పారిస్ దాడుల సూత్రధారిగా భావిస్తున్న అబ్దుల్ హమీద్ అబౌద్ తో పాటు పలువురు ముష్కరులు యూకేలో ప్రవేశించారట. మరికొందరు యూరప్ లోని ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల్లో చొరబడ్డారని సమాచారం. 28 ఏళ్ల అబౌద్ ఇటీవలే ఓ వీడియో మెసేజ్ ద్వారా హెచ్చరిక చేశాడు. మేం మీ భూభాగాల్లో అడుగుపెట్టాం అని ఈ నాలుగు దేశాలకూ వార్నింగ్ ఇచ్చాడు.
సిరియాలో ఐసిస్ హింసను తట్టుకోలేక పెద్ద సంఖ్యలో ముస్లింలు యూరప్ దేశాల్లోకి పారిపోయారు. శరణార్థులుగా ఆశ్రయం కోరారు. జర్మనీ మానవతా కోణంలో చాలా ఉదారంగా సరిహద్దులు తెరిచింది. లక్షల మంది శరణార్థులు జర్మనీలో ప్రవేశించారు. గ్రీస్ తో పాటు మరికొన్ని దేశాలూ శరణార్థులకు ఆశ్రయం ఇచ్చాయి. అయితే శరణార్థుల ముసుగులో ఉగ్రవాదులు రావచ్చని అప్పట్లోనే ఆందోళన వ్యక్తమైంది. ఇప్పుడు అదే నిజమైంది.
ముఖ్యంగా యూకేలో భీకరమైన దాడులు చేయడమే ఉగ్రవాదుల తొలి ప్రాధాన్యం అని నిఘా వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే యూకేను ముష్కరులు హెచ్చరించారు. ఇప్పుడు దేశంలో ప్రవేశించిన ఉగ్రవాదుల జాడను నిఘా అధికారులు త్వరగా తెలుసుకుని చెక్ పెట్టక పోతే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. టెర్రరిస్టులు ఎటు నుంచి విరుచుకు పడతారో తెలియదు. ఎంత మంది బలవుతారో తెలియదు. పారిస్ దాడులను మించి హింసకు పాల్పడతామని హెచ్చరించిన ఉగ్రవాదుల ప్లాన్ ఏమిటనేదే ఇప్పుడు అక్కడి ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది. లండన్ లో విరుచుకు పడతారా, వేరే చోట దాడులు చేస్తారా అనేది అంతుపట్టని విషయం. ఫ్రాన్స్, స్పెయిన్ లో ఎంత మంది ఉగ్రవాదులు చొరబడ్దారనేది తెలుసుకోవడానికి, దాడులకు నిరోధించడానికి అక్కడి నిఘా, భద్రతా అధికారులు అప్రమత్తమయ్యారు. రానున్న రోజుల్లో యూరప్ లో ఎంతటి భీకర దాడులు జరుగుతాయో అనే ఆందోళన నెలకొంది.